Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచుదుప్పటి కప్పేసినా.. కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం..!!

మంచుదుప్పటి కప్పేసినా.. కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం..!!
FILE
శీతాకాలం వచ్చిందంటే.. చల్లని గాలులు, పచ్చని పొలాలపై మంచుపరదాలు, సంక్రాంతి ముగ్గులు ఇవే అందరికీ గుర్తుకొస్తాయి. మంచు పరదాలను చీల్చుకుని వచ్చే సూర్యకిరణాలు భూమిని తాకుతుంటే ఆ అందానికి సాటి వేరే ఏముంటుంది. గజ గజా వణికిస్తున్న చలి, మంచు దుప్పటి కప్పేసిన ప్రకృతి, వర్షంలా కురుస్తున్న మంచు, కాశ్మీర్‌ను తలదన్నే ప్రకృతి అందాలను ఆరబోసే బోలెడన్ని ప్రాంతాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే బోలెడన్ని ఉన్నాయి.

పచ్చనిటోపీలు ధరించినట్లుగా ఠీవిగా నిలుచున్న పర్వతాలు, మెలికలు తిరిగే రహదారులు, గలగలమని ప్రవహించే సేలయేళ్ళు, చేతికందేంత దూరంలో నీలిమేఘాలు, సాగర తీరాలు, వెరసి కనువిందుచేసే ప్రకృతి ఒడి....ఇలాంటి ప్రాంతాలు కూడా మన రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. మరి వాటన్నింటినీ ఓసారి అలా చూసొద్దామా..?

జలజలా రాలుతున్న మంచుతో పచ్చగా కళకళలాడే పంటపొలాలు.. పచ్చటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, కనువిందు చేసే ప్రకృతితో ఎవరినా ఇట్టే కట్టిపడేసే ప్రాంతం ఆంధ్రా ఊటీ "అరకు". ఉదయాన్నే ఈ ప్రాంతంలో సందర్శిస్తే, జీవితకాలం సరిపడే తీపి అనుభూతులను గుండెనిండా పదిలం చేసుకోవచ్చు. అయితే మంచు పడుతుండగా, చలిలో తిరగటం కాస్త కష్టమైనా కనువిందు చేసే ప్రకృతి అందాలను చూస్తే మాత్రం, చలిగిలిని మర్చిపోయి ప్రకృతిలో లీనమైపోతారు.

webdunia
FILE
సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తున ఉన్న అరకులోయ అందాలను చూసి ఆస్వాదించవలసిందే తప్ప మాటల్లో చెప్పలేనిది. అరకు వెళ్లేందుకు బస్సు, ప్రైవేట్ వాహనాల్లో కంటే రైలు ప్రయాణమే ఉత్తమం. ఎందుకంటే, ఈ రైలు ప్రయాణమే ఓ అద్భుతమైన అనుభవంగా మిగిలిపోతుంది. సొరంగాలను దాటుతున్నప్పుడు వెలుగునీడలతో దోబూచులాడుతూ జలపాతాలను పలకరిస్తూ ఆ ప్రయాణం సాగుతుంది.

పొగమంచు, హాయిగా చేతులు చాచి ఆహ్వానిస్తుండే పర్వత పంక్తులను చూస్తూ సాగే ఆ ప్రయాణం చాలాకాలం గుర్తుంటుంది. ఇంకా ఇక్కడ గిరిజన మ్యూజియం, బొర్రా గుహలు, చాప్‌రాయ్ ప్రవాహం, కొండవాలులో పచ్చగా మెరిసే వలిసె పువ్వుల తోటలు, అమాయక గిరిజన ప్రజలు, ఎటుచూసినా కనిపించే పనసచెట్లు, కాఫీ తోటలు.. లాంటివన్నీ తప్పక చూసితీరాల్సినవే.

webdunia
FILE
ఇక విశాఖపట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే "అనంతగిరులు" సౌందర్యం వర్ణనాతీతం. తూర్పుకనుమలలో భాగంగా విస్తరించిన ఇవి సముద్రమట్టానికి 1150మీటర్ల ఎత్తున ఉన్నాయి. విశాలంగా పరచుకొన్న పచ్చదనం, కాఫీతోటలు, జలపాతాలు, గుబురుచెట్లు.. ఈ ప్రాంతంలో వాటి అందాలను ఆశ్వాదిస్తూ నడకసాగించడం ఒక అందమైన అనుభవం.

పడమటి ప్రాంతాలవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశం "హార్స్‌లీ హిల్స్". తిరుపతికి 150 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తున ఉన్న హార్స్‌లీ హిల్స్ వేసవి విడిదిగా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇక్కడ శీతాకాలంలో కూడా సందర్శించవచ్చు. అయితే విపరీతమైన చలి ఉంటుంది. ఏపుగా పెరిగిన యూకలిప్టస్, చందనం వృక్షాల నీడల్లోంచి నీలికొండలను స్పృశిస్తూ... చల్లటి గాలిలో తేలుతూ వస్తున్న సంపంగి పరిమళాలతో అలరిస్తుంటుంది.

అలాగే.. గోదావరి నదిలో పాపికొండలు, పట్టిసీమను చుట్టివచ్చే పడవప్రయాణం, కోనసీమలో తిరుగుతుంటే అచ్చం కేరళలో ఉన్నట్టే అనిపిస్తుంది. విశాలమైన గోదావరి ఒక్కసారిగా పాపికొండల దగ్గర వొదిగిన తీరు.. సూర్యాస్తమయం, సాయం సంధ్యవేళలు.. రాత్రవుతుంటే తళుక్కుమనే తారలు కళ్ళలో నింపుకోవాల్సిన అందాలేగానీ మాటలకు అందవు.

ప్రశాంతంగా గడపాలని కోరుకునేవారికి అద్భుతమైన ప్రదేశం "సూర్యలంక బీచ్". గుంటూరుజిల్లా బాపట్ల దగ్గరున్న ఈ బీచ్ హైదరాబాద్‌నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే.. కృష్ణానదిలో విహారానికి విజయవాడ దగ్గర భవానీ ఐల్యాండులో అన్ని సదుపాయాలు ఉన్నాయి. 130 ఎకరాల్లో విస్తరించిన భవానీ ఐల్యాండులో నౌకావిహారం ఓ అందమైన అనుభూతిగా మిగులుతుంది. ఇవేకాకుండా.. కొండపల్లి బొమ్మల తయారీ, నీలపట్టు బర్డ్ శాంక్చురీ, ఉండవల్లి గుహలు, అమరావతి బౌద్ధ స్థూపం తదితర పర్యాటక ప్రాంతాలు బోలెడన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu