Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పర్యాటక ప్రదేశాల నెలవు విజయవాడ

పర్యాటక ప్రదేశాల నెలవు విజయవాడ
, శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (19:19 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని మూడవ అతిపెద్ద నగరంగా విలసిల్లుతోన్న విజయవాడ ఓ చక్కని పర్యాటక ప్రదేశంగా కూడా వర్థిల్లుతోంది. బెజవాడ అని స్థానికులు పిల్చుకునే ఈ నగరంలోనే కనకదుర్గ అమ్మవారు ఇంద్రకీలాగ్రి కొండపై కొలువై ఉన్నారు. కృష్ణా జిల్లాలోని కృష్ణా నదికి ఒడ్డున కొలువైన విజయవాడ నగరంలో చూడ చక్కని ప్రదేశాలు అనేకం ఉన్నాయి.

విజయవాడలో చూడదగ్గ ప్రదేశాలు
విజయవాడ నగరంతో సహా దానికి చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాల్లో సైతం అనేక పర్యాటక ప్రదేశాలు నెలవై ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన వాటిగా కొన్నింటిని పేర్కొనవచ్చు. విక్టోరియా మ్యూజియం, ప్రకాశం బ్యారేజీ, గాంధీ కొండ, ఉండవల్లి గుహలు, మంగళగిరి నరసింహస్వామి ఆలయం, గుణదల మేరీమాత చర్చి, భవానీ ద్వీపం, అమరావతి, కనకదుర్గమ్మ ఆలయం తదితర ప్రదేశాలు విజయవాడ నగరాన్ని సందర్శించే పర్యాటకులకు ఓ చక్కని అనుభూతిని అందిస్తాయి.

కనకదుర్గమ్మ ఆలయం
విజయవాడ నగరం పేరు చెప్పగానే గుర్తోచ్చే దేవాలయం ఇదే. కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలలనుంచి ప్రతి ఏడాదీ లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. స్వయంభుగా వెలిసినట్టు పేర్కొనే ఇక్కడి అమ్మవారిని కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు విశ్వసిస్తుంటారు.

ప్రకాశం బ్యారేజీ
కృష్ణా నదిపై నిర్మించబడిన ఓ పెద్ద ఆనకట్టనే ప్రకాశం బ్యారేజ్ అన్న పేరుతో వ్యవహరిస్తారు. మొదట్లో 1852 నుంచి 1855 మధ్య కాలంలో ఈ ఆనకట్ట నిర్మించబడింది. అయితే దాదాపు వందేళ్లకు ఈ ఆనకట్టు వరద ఉదృతితో కొట్టుకుపోవడం జరిగింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు హయాంలో మరోసారి దీని నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగింది.

దీంతో ప్రకాశం బ్యారేజీ 1957 నాటికి మరోమారు కొత్త రూపు సంతరించుకుంది. దాదాపు 1223.5 మీటర్ల పొడవు కల్గిన ఈ ఆనకట్ట వల్ల 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. విజయవాడను సందర్శించిన వారు చూచి తీరాల్సిన ఓ అద్భుత కట్టడంగా దీన్ని పేర్కొనవచ్చు.

గాంధీ కొండ
గాంధీజీ సంస్మరణార్థం విజయవాడ నగరంలో ఓ స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 52 అడుగుల ఎత్తు కల్గిన ఓ స్థూపాన్ని కొండపై ఏర్పాటు చేశారు. ఈ కారణంగానే దీనికి గాంధీ కొండ అనే పేరు వచ్చింది. ఈ కొండ పైభాగంలో సౌండ్ అండ్ లైట్ షోలతో పాటు ఓ నక్షత్రశాల కూడా ఉంది. విజయవాడను సందర్శించిన పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే బాగుంటుంది.

విక్టోరియా మ్యూజియం
విజయవాడలోని స్థానిక బందరు రోడ్డులో ఈ మ్యూజియం ఉంది. పురావస్తుశాఖ వారు నిర్వహించే ఈ మ్యూజియంలో రాతి యుగానికి చెందిన పనిముట్లతో పాటు ఎన్నో చారిత్రక ఆధారాలు కల్గిన విశేషాలు కూడా ఉన్నాయి.


ఉండవల్లి గుహలు
విజయవాడ నుంచి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఈ గుహల లోపల అనంతశయన విష్ణువు భారీ విగ్రహాన్ని సందర్శించిన వారికి మర్చిపోలేని గొప్ప అనుభూతి కల్గుతుంది.

మంగళగిరి నరసింహస్వామి ఆలయం
విజయవాడకు దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం వెలసియుంది. పానకాల నరసింహస్వామిగా పిలవబడే ఈ స్వామివారి చరిత్ర ఆంధ్ర జనులకు సుపరిచియమే.

గుణదల మేరీమాత ఆలయం
విజయవాడలోని తూర్పు భాగంలో కొండపై వెలసిన ఈ చర్చికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతీ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఇక్కడ జరిగే ఉత్సవాలకు మతాలకతీతంగా వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.

భవానీ ద్వీపం
కృష్ణానదిలో ఉన్న అనేక ద్వీపాల్లో ఒకటిగా ఈ భవానీ ద్వీపం ఉంది. విజయవాడనుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ వారు నిర్మించిన ఓ రిసార్టు ఉంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వారికి ఇది ఓ చక్కని విడిది ప్రదేశం.

అమరావతి
విజయవాడ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఓ చిన్న పట్టణమే అమరావతి. బౌద్ధానికి సంబంధించిన అనేక విశేషాలను అమరావతిలో మనం దర్శించవచ్చు. ఇక్కడ ఓ పురావస్తు మ్యూజియం కూడా ఉంది. ఇందులో బౌద్ధానికి సంబంధించి పురాతన వస్తువులను తిలకించవచ్చు.

పైన పేర్కొన్న ప్రదేశాలే కాకుండా విజయవాడలో మరెన్నో ప్రదేశాలు చక్కటి పర్యాటక ప్రదేశాలుగా విలసిల్లుతున్నాయి. విజయవాడ, దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను సందర్శించగల్గితే ఓ చక్కని అనుభూతి మన సొంతమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu