Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణవాసుల కొంగు బంగారం "కొండగట్టు"

తెలంగాణవాసుల కొంగు బంగారం

"మనోజపం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్దిమతాం వరిష్టం

వాతాత్మజం వానరయూధ ముఖ్యం

శ్రీ రామదూతం శిరసానమామి...!"


అంటూ నిత్యం స్వామివారి ఆరాధనతో ప్రతిధ్వనిస్తూ... దట్టమైన అడవిలో ఎత్తయిన, విశాలమైన కొండల మధ్య వెలసిన "కొండగట్టు" క్షేత్రం భాసిల్లుతోంది. ఉత్తర తెలంగాణా భక్త జనం పాలిట కొంగు బంగారంగా, వారి కల్పతరువుగా, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న "కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం" కరీంనగర్ జిల్లా, మల్యాల మండలం, ముత్యంపేట గ్రామ పరిధిలో ఉంది.

భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, ఆపన్నులకు అభయహస్తంగా, సమస్యలలో ఉన్నవారికి ఆత్మస్థైర్యం కలిగించే దేవుడిగా భావించే కొండగట్టు అంజన్న దర్శనానికై రాష్ట్రం నలుమూలలనుంచే కాకుండా.. వివిధ రాష్ట్రాల నుంచీ కూడా భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ శ్రీ ఆంజనేయస్వామివారు ‘నారసింహ వక్త్రం‘, శంఖము, చక్రం కలిగి ఉత్తర ముఖారవిందమై దేదీప్యమానంగా ప్రకాశిస్తూ, భక్తుల కోరికల్ని తీర్చుతూ కొండగట్టు అంజన్నగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు.
గొర్రెలకాపరి కలలోకి వచ్చి...!
  పూర్వకాలంలో ఋష్యాదిమునులచేత పూజలందుకుని... ఎత్తయిన కొండలమధ్య నల్లరాతి గుహలు, పచ్చటి చెట్ల ప్రకృతి రమణీయమైన దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన స్వయంభు శ్రీ ఆంజనేయస్వామి, మొట్టమొదటగా సింగం సంజీవుడు అనే గొర్రెలకాపరికి కలలో సాక్షాత్కరించి తన ఉనికి..      


ముఖ్యంగా ఈ కొండగట్టు అంజన్న క్షేత్రానికి గ్రహపీడితులు, మతిస్థిమితంలేని వారు, అనారోగ్యులు తరలివచ్చి, ఈ ఆలయ ప్రాంగణంలోనే 41 రోజులు ఉండి, స్వామివారిని నిత్యం దర్శించుకుని ఆరోగ్యవంతులుగా మారి, తిరిగి వారి వారి స్వస్థలాలకు వెళ్ళడం ప్రత్యేకతగా చెప్పవచ్చు.

నిత్యం ఉదయం, పగలు, సాయంత్రం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీ ఆంజనేయస్వామిరి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళస్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది. శ్రీ బేతాళస్వామిని ఆలింగనం చేసుకుంటే గ్రహబాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

కరీంనగర్‌ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల నుండి నూతన వాహనాలు కొనుగోలు చేసిన భక్తులు ఈ క్షేత్రంలో తమ వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించుకోవడం కొండగట్టు క్షేత్రంలో రివాజు. స్వామివారికి అభిషేకాలు, వ్రతాలు, నిత్యఫలహారతులు, ముఖ్యమైన ఇతర మొక్కులు భక్తులు నిర్వహిస్తుంటారు.

శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయ దశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, ధనుర్మాసోత్సవం, గోదాకళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణ మేళా ఉత్సవం శ్రీ సుదర్శన యాగం మొదలగు ఉత్సవాలను ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.

అలాగే వైశాఖ బహుళ దశమిన శ్రీ హనుమాన్‌ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది హనుమాన్‌ భక్తులు దీక్ష తీసుకొని 41, 21, 11 రోజులు మూడు విధాలుగా నియమ, నిష్టలతో పాటించి చివరి రోజున అంజన్న సన్నిధిలో దీక్ష విరమిస్తారు.

ఆలయం నెలవైన కొండమీద ఘాట్ రోడ్డుప్రక్కనే ఒక జలబుగ్గ ఉంటుంది. ఇది సంవత్సరం పొడవునా నీటితో ఉన్నట్లయితే అధిక వర్షపాతం ఉంటుందనీ, పంటలు బాగా పండుతాయని కరీంనగర్ ప్రాంత రైతులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. అందుకే వర్షాకాలం ప్రారంభానికి ముందుగానే ప్రతి ఏడాది జలబుగ్గవద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహిస్తారు.

అలాగే కొండగట్టు చుట్టుప్రక్కల ఉండే సీతమ్మ ఏడ్చిన కన్నీటి గుంటలు, మునుల గుహలు, పులిపడ్డ బావి, బొజ్జపోతన్న, కొండలరాయుని గుట్ట, శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ వేంకటేశ్వర ఆలయం, అమ్మవారు, శ్రీరామ పాదుకలు, శ్రీ బొజ్జపోతన స్వామి ఆలయాలతో పాటుగా ఇతర ఉప ఆలయాలలో కూడా భక్తులు నిత్యం పూజాదికాలు నిర్వహిస్తుంటారు. కొండగట్టుకు అంజన్నకు ప్రధాన మొక్కుగా తలనీలాలు సమర్పిస్తుంటారు.

కొండగట్టు అంజన్న ఆలయం పురాతన చరిత్ర విషయానికి వస్తే... పూర్వకాలంలో ఋష్యాదిమునులచేత పూజలందుకుని... ఎత్తయిన కొండలమధ్య నల్లరాతి గుహలు, పచ్చటి చెట్ల ప్రకృతి రమణీయమైన దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన స్వయంభు శ్రీ ఆంజనేయస్వామి, మొట్టమొదటగా సింగం సంజీవుడు అనే గొర్రెలకాపరికి కలలో సాక్షాత్కరించి తన ఉనికి గురించి చెప్పినట్లు అనేక పురాణ కథలు ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu