Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏకశిలా విగ్రహాల తోరణం ఉండవల్లి

ఏకశిలా విగ్రహాల తోరణం ఉండవల్లి
, మంగళవారం, 15 జులై 2008 (17:48 IST)
ఆంధ్రప్రదేశ్‌లో చూడదగ్గ పర్యాటక కేంద్రాల్లో ఉండవల్లి గుహలను కూడా పేర్కొనవచ్చు. ఓ పెద్ద కొండను తొలిచి లోపల గదులుగా నిర్మించిన ఆనాటి శిల్పుల శిల్పాకళా నైపుణ్యానికి ఉండవల్లి గుహలు సజీవ సాక్షాలు. కొండకు ముఖ ద్వారాన్ని ఏర్పరచి అందులోంచి లోపలికి వెళ్లే కొద్దీ వివిధ రకాలైన దేవతా మూర్తులు, శిల్పాలు లాంటివి చెక్కియుండడం ఈ ఉండవల్లి గుహల ప్రత్యేకత.

ఉండవల్లి గుహలోని విశేషాలు
బయటినుంచి చూస్తే కొండముందు కట్టబడిన ఓ రాతి భవనం లాంటి నిర్మాణంగా గోచరించినా లోపలికి వెళితే ఓ అద్భుతలోకం ఆవిష్కరించబడుతుంది. గుహలోపల నాలుగు అంతస్థులుగా తొలచి అందులో దేవతా విగ్రహాలతోపాటు వివిధ రకాల శిల్పాలను చెక్కబడి ఉన్నాయి.

అలాగే కొండకు వెలుపలి భాగంలో తపోవనంలో ఉన్న మహర్షులను పోలిన విగ్రహాలు కన్పిస్తాయి. గుహలోపల శయనించి ఉన్న అతిపెద్ద మహా విష్ణువు విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ విగ్రహంతోపాటు ఇతర దేవతల విగ్రహాలు సైతం ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ గుహలను క్రీస్తు శకం 430 ప్రాంతంలో పాలించిన విష్ణుకుండుల కాలానికి చెందినవిగా చరిత్రకారులు పేర్కొంటారు.

ఈ ప్రాంతానికి చెందిన ఇతర విశేషాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఘాటైన మిర్చికి ప్రసిద్ధమైన గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలానికి చెందిన ఓ చిన్న గ్రామమైన ఉండవల్లిలో ఈ గుహలు ఉన్నాయి. ఇది పల్లెటూరు కావున ఇక్కడ పర్యాటకులకు అవసరమైన ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేదు.

ఉండవల్లి గ్రామానికి సమీపంలో ఉండే ఇతర ప్రాంతాల గురించి చెప్పాలంటే ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రాంతానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే విజయవాడ కూడా ఈ ప్రాంతానికి అతి సమీపంలోనే ఉంది. అమరావతి సైతం ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఉంది.

Share this Story:

Follow Webdunia telugu