Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప ప్రధాని పదవి నారావారికి నచ్చేనా..!!!

ఉప ప్రధాని పదవి నారావారికి నచ్చేనా..!!!
దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు సజావుగానే జరిగాయి. ఓ వైపు ఫలితాలు కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఫలితాలు వెలువడకముందే కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి.

తాజాగా తృతీయ కూటమిలో ఉంటుందనుకున్న టీఆర్‌ఎస్ క్రమంగా ఏన్డీఏ వైపుకు మరలుతోంది. రాష్ట్రంలో ద్వితీయ ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీవైపు జాతీయ పార్టీ అయిన బీజెపీ ఆశగా చూస్తోంది.

ఎన్నికలనంతరం ఎవ్వరూ..ఎవరికీ ప్రత్యర్ధులు కాదంటూ తాజాగా లూథియానాలో నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఉప ప్రధాని పదవిని ఇచ్చేందుకు ఎన్డీఏ సిద్దమైందన్న సమాచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తమకు పాత మిత్రుడైన నారావారికి ఉప ప్రధాని పదవి ఇవ్వడంలో తప్పేమీలేదంటున్న ఎన్డీఏ వర్గాల వ్యాఖ్యలు మరింత ఉత్కంఠతను కలిగిస్తున్నాయి. తృతీయ కూటమి నుంచి తమ వైపు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లో బాబు నిర్ణయం తమకే అనుకూలంగా ఉంటుందన్న విశ్వాసం ఎన్డీఏకి ఉంది.

ఇదిలావుండగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మహాకూటమి దారులు వేరయ్యే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో బాబుకు ఉప ప్రధాని పదవి ఇచ్చి దేశంలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకు ఎన్డీఏ పథకం పన్నినట్లు తెలుస్తోంది.

గత లోక్‌సభ ఎన్నికల్లో 60కి పైగా స్థానాలు సాధించిన వామపక్షాలు ఈ సారి 30-40 స్థానాలకు మించిరావని సర్వేలు చెబుతుండటంతో బిఎస్‌పి, తెలుగుదేశం, జనతాదళ్‌-ఎస్‌, బిజెడి ఇతర పార్టీలన్నీ కలిసినా 100-120స్థానాలకు మించవన్నది ఎన్డీఏ అంచనా.

తృతీయఫ్రంట్‌లోని జయలలిత నిర్ణయాలు ఎప్పుడెలా ఉంటాయో చెప్పనవసరం లేదు. కెసిఆర్‌, చౌతాలా, అజిత్‌సింగ్‌ వంటి కీలకనేతలు కూడా ఎన్టీఏ వైపు చూస్తున్నందున జాతీయ స్థాయిలో బాబు తప్పని సరిగా తమ వైపు వస్తారని ఎన్డీఏ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.

కాగా కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే వామపక్షాలు తప్పనిసరిగా యుపిఏకు మద్దతునిస్తాయని వామ పక్ష పార్టీ అగ్ర నేతలు అంటున్నారు. ప్రాంతీయ పార్టీలను కేంద్రమంత్రివర్గంలోకి ఆహ్వానించడంవల్ల స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో బిజెపి కూడా బలపడుతుందని కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజెపీ భావిస్తోంది.

దీంతో తాము తీసుకునే నిర్ణయాల ఫలితంగా దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో రెండు కూటములే ఉండే అవకాశా లుంటాయని బీజేపీ భావిస్తోంది. అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు తెలుగుదేశం పార్టీ ఆసక్తి చూపడం లేదు.

గతంలో నారా చంద్రబాబు నాయుడుకు ఐ.కే.గుజ్రాల్‌ హాయంలోనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఏకంగా ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని, అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఆ పదవిని త్యాగం చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతుంటారు. మరి బీజేపీ ప్రతిపాదించాలనుకున్న ఈ నిర్ణయానికి నారావారు అంగీకరించి అటు మొగ్గు చూపుతారో లేక దేవగౌడతో కలిసే ప్రయాణిస్తారో వేచి చూడాలి మరి...!

Share this Story:

Follow Webdunia telugu