Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సార్వత్రిక ఎన్నికలు: పోలింగ్‌కు సర్వం సిద్ధం

సార్వత్రిక ఎన్నికలు: పోలింగ్‌కు సర్వం సిద్ధం
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ విడతకు ప్రచారం మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసిన విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 124 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరుగుతుంది. రాష్ట్రానికి వస్తే.. ఉత్తర కోస్తా, తెలంగాణా ప్రాంతాల్లోని 22 పార్లమెంట్, 154 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది.

రంగంలో 1833 అభ్యర్థులు..
మొదటివిడత ఎన్నికల్లో అసెంబ్లీకి 1833 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా, పార్లమెంట్‌కు 315 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మొత్తం 31248524 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరికోసం 36320 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు 72,973 ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను వినియోగించనున్నారు.

ఎన్నికల పనుల్లో 60,947 మంది పోలీసులు, 123.2 కంపెనీల సీపీఎంఎఫ్, ఏపీపీఎస్సీ కమెండోలు, 3530 మొబైల్ పార్టీలు, 984 స్ట్రైకింగ్ ఫోర్స్, 353 మంది స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 752 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కాగా, తొలి విడత పోలింగ్‌లో 3090 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా పరిగణిస్తుండగా, 2337 కేంద్రాలను తీవ్రవాద బాధిత కేంద్రాలుగాను, 2109 కేంద్రాలను ఇబ్బందికరమైన కేంద్రాలుగాను, 4848 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

తొలి విడత బరిలోని ప్రముఖులు..
మొదటి విడత ఎన్నికల బరిలో తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేత, కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సినీనటి విజయశాంతి, స్వర్గీయ ఎన్‌టి.రామారావు కుమార్తె పురంధేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితర ప్రముఖులు ఉన్నారు.

అలాగే, దేశంలో రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, భాజపా సీనియర్‌ నాయకుడు మురళీ మనోహర్‌ జోషీలు ఉన్నారు. కాగా, కేరళలోని 20, మేఘాలయలో రెండు స్థానాలకు ఒకే దఫా ఎన్నికలు జరుగుతాయి.

మన రాష్ట్రంతో పాటు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, అస్సోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రాల్లోని కొన్ని స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరుగుతుంది. ఒకే పార్లమెంటు స్థానం ఉన్న అండమాన్‌- నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌, మిజోరం, నాగాలాండ్‌లలో కూడా గురువారమే ఎన్నికలు జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu