తెలుగు వెండితెరపై మెగాస్టార్‌గా వెలుగొందిన కొణిదెల చిరంజీవి.. రాజకీయ తెరపైనా కింగ్ మేకర్‌గా మారనున్నారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి.. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు ముచ్చెమటలు పోయిస్తున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో త్వరలో రెండు దశల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు సృష్టిస్తున్నామని, అధికారం తమదేనని ఆయా కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీ నేతలు ఎవరికివారే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే, వివిధ సర్వేలు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి.
ఈ పరిస్థితుల్లో తాజాగా "ది వీక్" అనే వార పత్రిక ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే సైతం ఇంచుమించు అదే ఫలితాలను వెల్లడించినప్పటికీ.. కింగ్ మేకర్ మాత్రం చిరంజీవి అని తేల్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటం ఖాయమని ఈ పత్రిక సర్వే నివేదిక పేర్కొంది.
294 సీట్ల శాసనసభలో 120-125 సీట్లు సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. కాంగ్రెస్, తెలుగుదేశాల ఓట్లను ప్రజారాజ్యం భారీఎత్తున చీలుస్తుందని, ఫలితంగా 57-60 సీట్లను కైవసం చేసుకుని చిరంజీవి కింగ్ మేకర్‌గా అవతరిస్తారని తెలిపింది. తెలుగుదేశం పార్టీకి 100-106 సీట్లు, ప్రజారాజ్యం పార్టీకి 57-60 సీట్లను సాధిస్తుందని ది వీక్ సర్వే పేర్కొంది.