Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక యూపీఏను భూతద్దం పెట్టి వెతకాల్సిందేనా...?

ఇక యూపీఏను భూతద్దం పెట్టి వెతకాల్సిందేనా...?

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

WD
యూపీఏపై దెబ్బమీద దెబ్బ పడుతోంది. కూటమిలోని భాగస్వామ పార్టీలు తమ అసలు రంగును బయటపెడుతున్నాయి. ఒక్కొక్కటిగా విడిపోయి వేరు కుంపటిలో చేరిపోతూ కాంగ్రెస్ గుండెల్లో మహా కుంపటిని రగుల్చుతున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఇది గట్టి ఎదురు దెబ్బే.

తమిళనాట అన్బుమణి రాందాస్ యూపీఏకు రాం.. రాం... పలికి అన్నాడీఎంకేతో చేతులు కలిపారు. ఆయనను యూపీఏలో తిరిగి కూర్చుండబెట్టాలన్న కాంగ్రెస్ ఆశలు అడియాశలే అయ్యాయి. చివరి వరకూ ఆయనను యూపీఎ గూటిలోనే పట్టి ఉంచాలని శత విధాలా యత్నించి కాంగ్రెస్ పార్టీ భంగపడింది.

యూపీఏను ఎందుకు వీడి వెళ్లాల్సి వచ్చిందో రాందాస్ లెక్కలు కట్టి మరీ వివరించి చెప్పారు. ఇటీవల తమ పార్టీలోని సభ్యులతో ఒక సమావేశాన్ని నిర్వహించామనీ, అందులో 2,453 మంది సభ్యులు ఏఐడీఎంకేతో కలిసి వెళ్లాలని తీర్మానిస్తే, కేవలం 117మంది మాత్రమే యూపీఏతో కలిసి కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

ఈ కారణంగానే యూపీఏకు తమ పార్టీ మద్దతును ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మరికొద్ది రోజుల్లో ప్రధాని మన్మోహన్‌కు తెలియజేయడంతో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి తన రాజీనామా సమర్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

తమిళనాట పరిస్థితి ఇలా ఉంటే అభినవ దుర్యోధనుడని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టిన లాలూ కాంగ్రెస్ పార్టీకి పెద్ద లొల్లిగా మారారు. కాంగ్రెస్ శత్రు వర్గాలను క్రమంగా తనవైపు ఆకర్షిస్తూ కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లు బీహార్‌లో వచ్చే ఎన్నికలను కలిసి ఎదుర్కోవాలని నిర్ణయించాయి.

అణు ఒప్పందం సమయంలో మన్మోహన్‌సింగ్ సర్కారుకు మద్దతు పలికిన సమాజ్‌వాదీ పార్టీ నేడు బద్ధ శత్రువులా మారింది. తాము వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆర్జేడీ, ఎల్జేపీలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నామని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే తాజా పరిణామాన్ని ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ ధృవీకరించారు. ఎల్జేపీ, ఎస్పీ, ఆర్జేడీ పొత్తు వార్తలు వాస్తవమేనన్నారు. తాను ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్‌లతో దీనికి సంబంధించి చర్చలు జరిపినట్లు రాంవిలాస్ వెల్లడించారు. మతతత్వ శక్తులను ఎదుర్కొనేందుకు తాము ఏకతాటిపైకి వచ్చామన్నారు.

ప్రాంతీయపార్టీల పొత్తు బాటతో దేశంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు బెంబేలెత్తి పోతున్నాయి. మారుతున్న సమీకరణాలను బట్టి చూస్తుంటే ఎన్నికలు జరిగేనాటికి యూపీఏ మిత్రపక్షాలను భూతద్దం పెట్టి వెతికినా కనబడని చందంగా మారిపోయే స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏం చేద్దాం... ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు ఏ రాజకీయ పార్టీ గోడ దూకుడు దానిదే.

Share this Story:

Follow Webdunia telugu