Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడేళ్ళలో టీడీపీ సర్కారు పడిపోతుంది.. తర్వాత మనదే ప్రభుత్వం: జగన్

మూడేళ్ళలో టీడీపీ సర్కారు పడిపోతుంది.. తర్వాత మనదే ప్రభుత్వం: జగన్
, మంగళవారం, 3 మార్చి 2015 (16:22 IST)
మరో మూడేళ్ళలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు పడిపోవడం ఖాయమని ఆ తర్వాత మన ప్రభుత్వమే వస్తుందని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన ప్రభుత్వం రాగానే అవసరం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటున్న ప్రతి ఒక్క ఎకరా భూమిని తాను అధికారంలోకి రాగానే తిరిగి ఆయా రైతులకు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 
 
గుంటూరు జిల్లా ఉండవల్లి ప్రాంతంలో ఆయన పర్యటించి, రైతులు.. రైతు కూలీలు.. రైతు మహిళలతో మాట్లాడారు. 'ఇక్కడకు సమీపంలోనే వినుకొండలో 18 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అక్కడ తీసుకుంటామంటే ఏ రైతూ అభ్యంతరం చెప్పరు. అలాంటి చోటును వదిలేసి, మూడు పంటలు పండే బంగారంలాంటి భూమిని బలవంతంగా లాక్కుని సింగపూర్ సిటీ కడతాననడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నా. రైతులు, రైతు కూలీలు, అందరి దగ్గర్నుంచి విషయం తెలుసుకున్నాం. అందరి బాధలు విన్నాం. భూములు తీసుకుంటే ప్రజలు బతికే పరిస్థితి కూడా లేదని చంద్రబాబుకు తెలియడంలేదన్నారు. 
 
మళ్లీ మళ్లీ ఒక్క విషయం చెబుతున్నా. చంద్రబాబు నాయుడు బలవంతంగా ఏ ఒక్కరి నుంచి భూములు తీసుకున్నా.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకూ ప్రతి భూమీ తిరిగి ఇస్తానని చెబుతున్నా. అందరం కలిసికట్టుగా చంద్రబాబు మెడలు వంచి అయినా సరే, పోరాటం చేద్దాం. మనసులో కొండంత బాధ ఉన్నా.. చిరునవ్వుతో ఇక్కడికొచ్చి పలకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగం ముగించారు.
 
రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. రెండు, మూడేళ్లలో టీడీపీ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని, ఆ తర్వాత మన పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి రాగానే రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. 
 
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను లేవనెత్తుతామని అన్నారు. డబ్బుల్లేవంటున్న చంద్రబాబు సింగపూర్ లాంటి రాజధానిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. రైతుల తరపున వైకాపా పోరాటం చేస్తుందని చెప్పారు. చంద్రబాబు రియలెస్టేట్ వ్యాపారిలా మారారని ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu