Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖకు కేంద్రం అండ.. విశాఖను స్మార్ట్ సిటీగా చేస్తాం : విశాఖలో వెంకయ్య

విశాఖకు కేంద్రం అండ.. విశాఖను స్మార్ట్ సిటీగా చేస్తాం : విశాఖలో వెంకయ్య
, గురువారం, 23 అక్టోబరు 2014 (11:35 IST)
హుదుద్ తుఫాను ధాటికి కకావికలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సుందరనగరం విశాఖపట్నం మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. విశాఖ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. 
 
బుధవారం నాడు ఆయన విశాఖలో పర్యటించారు. విశాఖలో తుఫాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున పక్కా ఇళ్ళు మంజూరు చేయనున్నామని హామీ ఇచ్చారు. బుధ, గురువారాల్లో తాను విశాఖపట్నంలోనే ఉటానని, ఈ ఏడాది దీపావళిని తాను విశాఖ తుఫాను బాధితులతో కలసి జరుపుకుంటానని వెంకయ్య ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగానే ఆయన విశాఖలో గడుపుతున్నారు. 
 
మరోవైపు... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు ప్రతీక అంటూ కొనియాడారు. అలాగే, సంస్కారానికి, ఆత్మవిశ్వాసానికి విశాఖ ప్రజలు ప్రతీకలని, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులపై వారు చూపిన నమ్మకానికి సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. 
 
బుధవారం రాత్రి విశాఖలో 'తుఫానును జయిద్ధాం' అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తుఫాన్‌ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. ‘చంద్రబాబుకు పని... పని.. పని...పనిచేయడమే పని’ అంటూ సభలో నవ్వులు పూయించారు. రూ. వెయ్యి కోట్ల సాయం కాదు.. విశాఖ నగరం తిరిగి పూర్వవైభవం సంతరించుకునేంత వరకు పూర్తిగా కేంద్రం అండగా ఉంటుందని వెంకయ్య పునరుద్ఘాటించారు. 
 
తాను ఈసారి దీపావళికి దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. తుఫాన్‌కు ఇళ్లు దెబ్బతిన్నవారు ఆందోళన చెందాల్సిన పని లేదని, అన్నింటినీ పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విశాఖను స్మార్ట్‌సిటీగా మార్చడంపై స్పందిస్తూ ‘అలాంటి నగరం సృష్టించాలంటే స్మార్ట్‌ ప్రజలు, దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగే నాయకుడు కావాలి. అవన్నీ విశాఖలో ఉన్నాయి. వారికి చంద్రబాబు వంటి నాయకుడు ఉన్నారని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu