Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌న్యంలో ఉనికి కోల్పోతున్న మావోయిస్టులు

మ‌న్యంలో ఉనికి కోల్పోతున్న మావోయిస్టులు
, శుక్రవారం, 10 జూన్ 2016 (21:38 IST)
విశాఖ మన్యంలో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతల ఎన్‌కౌంటర్.. ఆరోగ్య సమస్యలు.. పెరుగుతున్న పోలీసుల నిర్భంధం.. క్యాడర్ మధ్య విభేదాలు... లొంగిపొమ్మంటూ కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులో వరుసగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. దీంతో ఏవోబీలో పటిష్టంగా ఉన్న మావోయిస్టులు ఇప్పుడు తమ ఉనికినే కోల్పోతున్నారు.
 
ఒకప్పుడు విశాఖ మన్యం మావోయిస్టులకు పెట్టని కోటగా ఉండేది. ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో దాడులు చేసి.. అక్కడి నుంచి ఏవోబీలోకి వచ్చి తప్పించుకునేవారు. ఇంతేకాకుండా ఏవోబీలో కోరుకొండ, గాలికొండ దళాలు పోలీసులకు సవాళ్లు విసిరేవి. ఇక ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో తరుచుగా సమావేశాలు, సభలు వారోత్సవాలు నిర్వహించే వారు. అలాంటిది ఇప్పుడు క్యాడర్‌ను కాపాడుకోవడం మావోయిస్టులకు పెద్ద సమస్యగా మారింది. వరుసగా ఘటనలు మావోయిస్టుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
 
ఇటీవల కాలంలో ఏవోబీలో మావోయిస్టులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఏవోబీలో మావోయిస్టు కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొనే కుడుముల రవి అనారోగ్యంతో మరణించాడు. ఇతని మరణం నుంచి కోలుకోక మునుపే విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాకల గ్రామం వద్ద మావోయిస్టులు.. పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏవోబీలో కమాండర్ ఆజాద్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఇదే సమయంలో వరుసగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడం కూడా కలవరపెడుతోంది.
 
మావోయిస్టుల కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మన్యం మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర వహిస్తున్న ఈస్ట్ డివిజన్ మెంబర్ అయిన వంతల వసంత అలియాస్ జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంతల వసంతపై 15 హత్య కేసులతో సహా 51 కేసులున్నాయి. ఈమెపై నాలుగు లక్షల రివార్డు కూడా ఉంది. ఇదే సమయంలో మరో ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. తాజాగా ఛత్తీస్ గఢ్‌లో సెంట్రల్ మిలటరీ ట్రైనింగ్ తీసుకున్న ఏకైక మహిళ మావోయిస్టు కడబాల లక్ష్మి అలియాస్ సరితా, ఏవోబీతో పాటు చత్తీస్ గఢ్‌లో పనిచేసిన బోనంగి రాములమ్మ అలియాస్ భారతక్కతో మావోయిస్టు సభ్యురాలు తాంబేలు తుమ్మ అలియాస్ విజయలు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
 
విశాఖ మన్యంలో మావోయిస్టులు బలహీనమవడానికి లొంగుబాట్లతో పాటు అనేక అంతర్గత కారణాలు ఉన్నట్లు పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ కోవలో ఏజెన్సీలో మావోయిస్టులు పుంజుకునే అవకాశమే లేదని ఒకవేళ ఆ ప్రయత్నాలు చేసినా పూర్వపు స్థాయికి ఉద్యమాన్ని తీసుకువెళ్లడం అసంభవమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా పుష్క‌రాల లోగో రెడీ..ఆవిష్క‌రించిన ఏపీ సీఎం