Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడ మెట్రోకు 2న శంకుస్థాపన.. ఆ తర్వాత పనుల్లో పరుగులు!

విజయవాడ మెట్రోకు 2న శంకుస్థాపన.. ఆ తర్వాత పనుల్లో పరుగులు!
, మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (20:28 IST)
నవ్యాంధ్రప్రదేశ్‌కు తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు అక్టోబర్ రెండో తేదీన శంకుస్థాపన చేయాలని ఏపీ సర్కారు గట్టిపట్టుదలతో ఉంది. ఇందులోభాగంగా ఈ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న ఢిల్లీ మెట్రో ఇప్పటికే సివిల్‌ వర్క్స్‌ కోసం టెండర్స్‌‌ను కూడా ఆహ్వానించింది. అయితే, శంకుస్థాపన తర్వాత భూ సేకరణ పనులు ప్రారంభించి పనులు వేగవంతం చేయాలని భావిస్తోంది. 
 
ఈ ప్రాజెక్టుకు సంబంధించి అతి తక్కువ వ్యవధిలో డీపీఆర్‌ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం కావడం, ఆ వెంటనే కేబినెట్‌ ఆమోదించడం, టెండర్స్‌ పిలవడం... ఇలా విజయవాడ మెట్రోరైల్‌కు సంబంధించిన పనులన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో గాంధీ జయంతి రోజున శంకుస్థాపన చేశాక పనుల్ని పరుగులు పెట్టించాలన్న పట్టుదలతో టీడీపీ సర్కారు ఉంది. 
 
ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి కారిడార్‌ను నెహ్రూ బస్ స్టేషన్ నుంచి నిడమానూరు వరకు, రెండో కారిడార్‌ను బస్ స్టేషన్ నుంచి కానూరు ఇంజనీరింగ్ కాలేజి వరకు నిర్మించబోతున్నారు. రెండూ కలిపి 24 కిలోమీటర్ల మేరకు ఉంది. ఈ మార్గం మొత్తం 2018 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కిలో మీటర్‌కు ఒక స్టేషన్‌ చొప్పున నిర్మించనున్నారు. 
 
కాగా, మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ఇప్పటికే అమరావతి రెయిల్ కార్పోరేషన్ ఏర్పాటైంది. ఇప్పటివరకు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయి. శంకుస్థాపన తర్వాత భూసేకరణ కూడా సులభంగా ముగిస్తే మెట్రో మ్యాన్ శ్రీధరన్ అనుకున్నట్టుగా 2018 నాటికి రెండు కారిడార్స్ పూర్తయి మెట్రో రైల్ పరుగులు పెట్టే అవకాశాలు లేకపోలేదు. 

Share this Story:

Follow Webdunia telugu