Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాతృభాషను మరిచినవాడు మనిషే కాదు : వెంకయ్య నాయుడు

మాతృభాషను మరిచినవాడు మనిషే కాదు : వెంకయ్య నాయుడు
, శనివారం, 28 మార్చి 2015 (17:11 IST)
ఆంగ్లం నేర్చుకోవడంలో తప్పులేదనీ, అదేసమయంలో మాతృభాషను మరిచిపోవద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మాతృభాషను మరచిన వాడు మనిషే కాదన్నాడు. చిత్తూరు జిల్లా మేర్లపాకలో మూడు విద్యాసంస్థల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. మూడు విద్యాసంస్థలు ఇక్కడ ఏర్పాటుకానుండటం త్రివేణి సంగమంలా అనిపిస్తోందన్నారు. 
 
రామరాజ్యం రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. రామరాజ్యం అంటే... ఆకలి లేనిది, అవినీతి లేనిది, అరాచకాలు లేనిది అని చెప్పుకొచ్చారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆంగ్లం నేర్చుకోండి, మాతృభాషను మాత్రం మరిచిపోవద్దని సూచించారు. 
 
జన్మభూమి, మాతృభాషను మరిచిన వాడు మనిషే కాదని సూత్రీకరించారు. విదేశాలకు వెళ్లడం తప్పుకాదని, జ్ఞానం పెంచుకునేందుకు వెళ్లాలని హితవు పలికారు. గో, లెర్న్, ఎర్న్, రిటర్న్ అనే విషయాలను విద్యార్థులందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. సరస్వతి ఉంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందన్నారు. 
 
ఆ తర్వాత భూసేకరణ బిల్లు ఆవశ్యకతను, అవసరాన్ని నొక్కివక్కాణించారు. అభివృద్ధి చెందాలంటే ప్రాజెక్టులు, పరిశ్రమలు, రహదారులు అవసరమన్నారు. అందుకు భూమి కావాలని, భూసేకరణ ద్వారానే అది సాధ్యమని వివరించారు. అయితే, కొందరు భూసేకరణపై అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 
 
రోడ్లు వేయాలంటే భూమి కావాలని, పరిశ్రమలు కట్టాలంటే భూమి కావాలని, చెరువులు తవ్వాలంటే భూమి కావాలన్నారు. అలా కాకుండా భూమితో పనిలేకుండా చెరువులు ఆకాశంలో తవ్వగలమా? అని ప్రశ్నించారు. అందుకే, భూసేకరణకు అందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రంలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, సుజనా చౌదరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులు కూడా పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu