ఇకపై వెయ్యి మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా అమరావతిని కదల్చలేరని, నవ్యాంధ్ర శాశ్వత రాజధాని అమరావతి అని అందుకు తగిన విధంగా లోక్‌సభలో బిల్లు పెడతాం అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు లేదా వచ్చే సమావేశాల్లోగానీ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.
రాజధానిని 2014 నుంచి గుర్తించాలా లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే దానిపై ఉన్న సాంకేతిక కారణాల వల్లే బిల్లు ఆలస్యమవుతోందని పెమ్మసాని వివరించారు. ఈ ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అమరావతి బిల్లుపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విషం కక్కుతున్నారని, ఆయనను శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలంటూ పెమ్మసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు పాలన చేతకాకపోవడం వల్లే 34 వేల మంది రైతులు ఇచ్చిన భూములను సద్వినియోగం చేసుకోలేక రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే వేలాది మంది నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్నారని పెమ్మసాని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 16 జాతీయ సంస్థలకు శంకుస్థాపనలు చేశారని, త్వరలోనే హడ్కో, కాగ్, పోస్టల్ భవనం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వంటివి అమరావతి ఏర్పాటు కానున్నాయని మంత్రి పెమ్మసాని తెలిపారు.