Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కవిత కాశ్మీర్ కామెంట్స్: దేశవ్యాప్తంగా దుమారం!

కవిత కాశ్మీర్ కామెంట్స్: దేశవ్యాప్తంగా దుమారం!
, మంగళవారం, 22 జులై 2014 (16:30 IST)
టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీంతో కవిత నోటిదూల ఎందుకు అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశంలోని కొన్ని భాగాలు భారత్‌కు చెందినవి కావని, దీన్ని మనం అంగీకరించాలని... కాశ్మీర్‌ను ఉద్దేశిస్తూ కవిత ఇటీవల ఓ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు.
 
స్వాతంత్రానికి ముందు జమ్ముకాశ్మీర్, హైదరాబాద్ ప్రత్యేక దేశాలని... స్వతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్, హైదరాబాద్‌లను బలవంతంగా భారతదేశంలో కలిపారని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జమ్ముకాశ్మీర్‌తో పాటు తెలంగాణలో భూచట్టాలు ఒకేలాగా ఉన్నాయని... ఇరుప్రాంతాల్లో స్థానికులు తప్ప ప్రాంతేతరులు భూములు కొనడం నిషిద్ధమని ఆమె అన్నారు. 
 
అయితే, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతపైనా, సమాఖ్య చట్టబద్ధతపైనా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని అన్నారు. ఏమైనా ఆమె వ్యాఖ్యలు అవాస్తవాలని సింఘ్వీ పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించడం తగదని హితవు పలికారు. జమ్మూకాశ్మీర్‌కు మాత్రమే 370 ఆర్టికల్ వర్తిస్తుందని, తెలంగాణకు ఎలా వర్తిస్తుందని ఆయన ప్రశ్నించారు. 
 
ఇక, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ మాట్లాడుతూ, కవిత వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమని అన్నారు. ఇలాంటి విపరీత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. 
 
కాగా, జమ్ముకాశ్మీర్‌పై భారతదేశానికి స్పష్టత రావాలని... అవసరమైతే అంతర్జాతీయ సరిహద్దుల్ని భారత్ మార్చుకోవాలని, కాశ్మీర్‌ను భారత్ వదులుకోవాలన్న అర్థంలో మాట్లాడటంతో కవిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదస్పదమయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu