Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫైనాన్స్ కంపెనీలో చోరీ... అనుమానాలెన్నో...?

ఫైనాన్స్ కంపెనీలో చోరీ... అనుమానాలెన్నో...?
, బుధవారం, 28 జనవరి 2015 (09:42 IST)
నెల్లూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో చోరీ జరిగింది. దుండగులు రూ.7.15 లక్షల నగదు దోచుకెళ్ళారు. సంఘటనపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. మంగళవారం తెల్లవారు జామున జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులోని ఆచారి వీధిలో ఐదేళ్లుగా హిందూ జా లేలాండ్ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. 
 
నెల్లూరుకే చెందిన ఎం.మహేష్ బ్రాంచ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. శనివారం బ్యాంకు సమయం మించిపోవడంతో కంపెనీకి సంబంధించిన రూ.7.15 లక్షల నగదును కార్యాలయంలోని లాకరులోనే ఉంచారు. ఆదివారం సెలవు కావడంతో కార్యాలయం తెరవలేదు. సోమవారం సెలవు అయినప్పటికీ మహేష్‌తో పాటు పలువురు సిబ్బంది వచ్చి సాయంత్రం వరకు కార్యాలయంలోనే ఉన్నారు. అనంతరం తాళం వేసుకుని వెళ్లారు. 
 
మంగళవారం ఉదయం 9.30 గం టలకు మహేష్ కార్యాలయం తలుపు తెరవగా లోపలంతా మిరప్పొడి చల్లి ఉండటంతో పాటు దక్షిణ భాగంలోని తలుపు తెరిచి కనిపించింది. లాకర్ సైతం పగలగొట్టి ఉండటం గుర్తించి వెంటనే ఒకటో నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని నగర పోలీసులు పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. కంపెనీ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. 
 
ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణం వైపు తలుపు తెరిచివుందని మహేష్ చెబుతుండగా ఆ వైపు నుంచి దుండగులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కార్యాలయం మూడో అంతస్తులో ఉండటం, దక్షిణం వైపు కరెంట్ తీగలు ఉండటంతో అటువైపు నుంచి దొంగలు వచ్చే అవకాశం లేదు. 
 
నేరుగా తలుపులు తెరిచే లోనికి ప్రవేశించి, తిరిగే వెళ్లే సమయంలో తాళాలు వేసుకుని వెళ్లి ఉంటారని పోలీసులు భావించి ఆ దిశగా విచారణ చేపట్టారు. కార్యాలయానికి సంబంధించిన తాళాలు రెండు సెట్లు ఉండగా ఒక సెట్‌ను ఆఫీస్‌బాయి చంద్ర కొన్ని నెలల కిందట పోగొట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో చంద్రను సైతం విచారిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇంటి దొంగల పని అయి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu