ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం అయ్యే వ్యక్తి అనీ, సీఎం అవుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అందువల్ల అలాంటి నాయకుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని అన్నారు. ఆయన కోనసీమ గురించి ఏమి మాట్లాడారో నేను చూసానంటూ చెప్పిన ఉండవల్లి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందంటూ చెప్పుకొచ్చారు.
చిన్నచిన్న విషయాలు జరుగుతుంటాయి: కోమటిరెడ్డి
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెనక్కి తగ్గారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సుకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించేందుకు విజయవాడకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాను పవన్ కళ్యాణ్‌ను విమర్శించలేదన్నారు. చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి. పోతుంటాయి వాటిపై నో కామెంట్స్ అంటూ ఆయన వివాదానికి ముగింపు పలికారు. కాగా, ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పాలని లేనిపక్షంలో పవన్ సినిమాలు తెలంగాణాలో ఆడనివ్వబోమని హెచ్చరించారు. పవన్ వెంటనే సారీ చెప్తే తెలంగాణాలో ఆయన సినిమా కనీసం ఒకటి రెండు రోజులైనా ఆడుతాయి. లేకపోతే, తెలంగాణాలో ఆయన సినిమాలు ఆడనివ్వం అంటూ హెచ్చరించిన విషయం తెల్సిందే.
కాగా, ఇటీవల పవన్ కోనసీన జిల్లా పర్యటనలో మాట్లాడుతూ, కోనసీమ పచ్చదనానికి నరదిష్టి తగిలిందని, అందుకే పచ్చని కొబ్బరి చెట్లు ఇలా ఎండిపోయాయని, ముఖ్యంగా, తెలంగాణ నేతల దిష్టేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా పవన్‌పై విమర్శలు గుప్పించారు. వీరిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు.