Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో వేగంగా జరుగుతున్న మహానాడు పనులు.. 22న తిరుపతికి నారా లోకేష్‌

తిరుపతిలో వేగంగా జరుగుతున్న మహానాడు పనులు.. 22న తిరుపతికి నారా లోకేష్‌
, శనివారం, 21 మే 2016 (13:06 IST)
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడుకు తిరుపతిలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 27, 28, 29వ తేదీలలో మహానాడు జరుగనుండటంతో అతి వేగంగా పనులను చేస్తున్నారు. అటవీ శాఖామంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మహానాడు ఏర్పాట్లపై టిడిపి సీనియర్‌ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడలో సమావేశమయ్యారు.
 
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మహానాడును మాత్రం తిరుపతిలో సెంటిమెంట్‌‌గా నిర్వహిస్తూ వస్తోంది. టిడిపి మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావుకు తిరుపతి అంటే ఎంతో ఇష్టం. అప్పట్లో ఆయన ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా ఇక్కడ నుంచే చేపట్టేవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాతనే ఎన్‌టిఆర్‌ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించే వారని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఆ సెంటిమెంట్‌నే చంద్రబాబు కూడా నమ్ముతున్నారు. అందుకు తిరుపతిలో ఇప్పటికే మూడుసార్లు మహానాడును నిర్వహించారు. అందులో రెండుసార్లు మహానాడును నెహ్రూమున్సిపల్‌ సభాస్థలిలోనే నిర్వహించబోతున్నారు.
 
తిరుపతిలోనే నెహ్రూమున్సిపల్‌ సభాస్థలి ఎంతో అనువైన స్థలం. ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నా ఈ స్థలం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకు నెహ్రూ మున్సిపల్‌ సభాస్థలాన్ని ప్రతి ఒక్కరు తమ పార్టీ కార్యక్రమాల కోసం ఎంచుకుంటుంటారు. అంతేకాకుండా తిరుమల శ్రీవారి పాదాల చెంత ఈ స్థలం ఉంది. కొండలకు అతి సమీపంలోనే ఉండడంతో పాటు తిరుమల వ్యూ ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది. అందుకు సెంటిమెంట్‌గా ఇదే స్థలాన్ని ఎంచుకుంటారు. 
 
ప్రస్తుతం జరిగే మహానాడుకు ఎంతో వేగంగా పనులు జరుగుతున్నాయి. మరో ఆరు రోజులు మాత్రమే మహానాడుకు సమయం ఉండటంతో పనులు శరవేగంగా చేస్తున్నారు. రెండు రోజుల్లోగా పనులు పూర్తి చేయాలన్న భావనతో ఉన్నారు.100 మందికిపైగా కూలీలు మహానాడు పనులు చేస్తున్నారు. మహానాడు పనులను కూడా టిడిపి కాంట్రాక్టర్‌కే పార్టీ అప్పజెప్పింది.
 
మహానాడు సభాస్థలిలో 30వేల మందికిపైగా నాయకులు, కార్యకర్తలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన సీనియర్‌ నాయకులు వేదికపై కూర్చునే విధంగా సభాస్థలిని రూపుదిద్దుతున్నారు. 
 
మరోవైపు... తిరుపతిలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను రేపు నారాలోకేష్‌ పరిశీలించనున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం విమానంలో తిరుపతి విమానాశ్రయానికి నారా లోకేష్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా నెహ్రూ మున్సిపల్‌ సభాస్థలికి చేరుకుంటారు. ఆ తర్వాత జరుగుతున్న పనులను పరిశీలించి టిడిపి, నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదేళ్ళ బాలికపై 60 యేళ్ళ కామాంధుడి లైంగిక దాడి