Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిం... కర్తవ్యం...! కేంద్రంతో తెగదెంపులు చేసుకుందామా..?

కిం... కర్తవ్యం...! కేంద్రంతో తెగదెంపులు చేసుకుందామా..?
, శనివారం, 1 ఆగస్టు 2015 (07:34 IST)
ఏమి అడిగినా ఉలకరు.. పలకరు.. పేరుకేమో మిత్రపక్షం.. కనీసం విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటిపైనా నోరు మెదపరు.. ఇక ప్రత్యేక హోదా ఇవ్వమని ముఖం మీదే చెప్పినా ఇంకా ఆ పార్టీతో కొనసాగితే ఎలా ఉంటుంది.? ప్రజల్లో పలచన అయిపోతాం... కాస్త తీవ్రంగా ఆలోచించండి సార్... జనంలో ప్రత్యేక హోదా డిమాండ్ పెరిగిపోతోంది. మనం ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి అన్న మంత్రుల మాటలతో చంద్రబాబు కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది. అమీతుమీ తేల్చుకోవడానికే రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయాలని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. 
 
రాష్ట్రాలకు కొత్తగా ప్రత్యేక హోదా కల్పించేది లేదంటూ కేంద్ర మంత్రి ఇంద్రజిత్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దుమారం చెలరేగినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్తులుగా ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల్ని పరిరక్షించుకోలేక పోతున్నామన్న ఆందోళన మంత్రివర్గ సహచరులతో సహా చంద్రబాబు కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
 
webdunia
రాష్ట్ర విభజనానంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశంలు పొత్తు పెట్టుకున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో తమకు కేంద్రం నుంచి విశేష సహకారం అందుతుందని తెలుగుదేశం ఆశించింది. కానీ పరిస్థితి మొత్తం అందుకు విరుద్దంగా నడుస్తోంది. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం లోటు బడ్జెట్‌ను పూరించాలన్న అంశంపై కూడా స్పందించలేదు. ఇవే కాదు.. కేంద్రం స్పష్టంగా చట్టం చేసినప్పటికీ పోలవరానికి ఇంతవరకు వందకోట్లే కేటాయించారు. దీనికి జాతీయహోదా ఇచ్చినా నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహించారు. దీంతో ఈ ఏడాదికాలంగా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీలు భాగస్తులైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగిందేంలేదు. పైగా ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా లేదంటూ అనూహ్యమైన షాకిచ్చారు. కేంద్రమంత్రి ప్రకటన వచ్చీరాగానే మరోసారి ఉద్యమాలకు వైకాపా సిద్ధపడింది. 
 
నేరుగా ఈ సారి ఢిల్లీలోనే ఉద్యమించాలని ఆ పార్టీనేత జగన్‌ నిర్ణయించారు. ఇందుకోసం తేదీల ఖరారును మొదలెట్టారు. పార్లమెంట్‌లో తామిచ్చిన ప్రత్యేక హామీని బీజేపీ ప్రభుత్వం అమలు చేసి తీరాల్సిందేనంటూ కాంగ్రెస్‌ నేతలు రోడ్డెక్కారు. ఈ దశలో ఎటూ పాలుపోని పరిస్థితిని బాబు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి తెచ్చినా రాష్ట్ర ప్రయోజనాల్ని కేంద్రం నుంచి సాధించుకునే అవకాశాల్లేవని ఆయనకు తేలిపోయింది. ఈ దశలో ప్రత్యేక హోదాకోసం ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇవ్వడమా లేక తానే దాన్ని అందిపుచ్చుకుని ఉద్యమించడమా అన్న సందిగ్ధంలో పడ్డారు. 
 
కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్రానికేం సాధించలేక పోతున్నారన్న అపప్రదను మూటగట్టుకుని, ఉద్యమించే మహత్తర అవకాశాన్ని విపక్షాలకు వదిలేయకుండా తానే ఆ బాధ్యత చేపట్టడం ద్వారా తన నిబద్దతను నిరూపించుకోవాలన్న దిశగా పలువురు మంత్రులు ఆయనకు సూచించారు. ఆగస్టు 15వరకు వేచిచూసే ధోరణిని అవలంబించి ఆ తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన ఈ సమావేశంలో వ్యక్తమైంది. 

Share this Story:

Follow Webdunia telugu