Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవం
, ఆదివారం, 29 మార్చి 2015 (11:44 IST)
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేటలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి పీతల సుజాత పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు.
 
అలాగే, ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరింతగా కష్టపడాలని పిలుపునిచ్చారు. తనకు రెండు తెలుగు రాష్ట్రాలూ ముఖ్యమేనని, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలే కీలకమని అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న గౌరవాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
కాగా, పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించి, అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువ నేత నారా లోకేశ్ తోపాటు మంత్రి అయ్యన్నపాత్రుడు, తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌ గౌడ్, పెద్దిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu