Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తలసాని స్టైలే వేరు: ఇంతకీ టీఆర్ఎస్‌లో చేరుతారా? లేదా?

తలసాని స్టైలే వేరు: ఇంతకీ టీఆర్ఎస్‌లో చేరుతారా? లేదా?
, మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (12:53 IST)
సనత్‌నగర్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్టైలేవేరుగా ఉంది. పాలిటిక్స్‌లో ఆయన స్టైల్ విశ్లేషకులకే అర్థం కావట్లేదు. ఇంతకీ తలసాని టీడీపీలో ఉంటారా? టీఆర్ఎస్‌లో చేరుతారా? అనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. 
 
పార్టీ మారుతున్నానని చెప్పకుండానే.. పార్టీమారబోతున్నారనే సంకేతాలివ్వడంలో ఆరితేరిపోయిన తలసాని.. తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఐడీహెచ్ కాలనీలో పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అక్కడకు రావాల్సిందిగా ఆహ్వానించారు. 
 
హామీ మేరకు కేసీఆర్ ఐడీహెచ్‌కాలనీకి వెళ్లి ఐదు నెలల్లోగా పక్కాగృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మామూలుగానైతే ఈ అంశాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ.. పార్టీ శాసనసభాపక్ష నేత పదవిని ఆశించి భంగపడ్డ ఆయన వీలు దొరికిన ప్రతిసారీ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లనున్నారనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
 
గతంలో బోనాల పండుగ సందర్భంలో ఫలహారం బండి ఊరేగింపు సందర్భంగా సైతం కేసీఆర్ తలసాని నివాసం వద్దకు వెళ్లారు. అప్పట్లోనూ త్వరలోనే తలసాని టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం గుప్పుమంది. తాజాగా టీడీపీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరికొందరు టీఆర్‌ఎస్‌కు వెళ్లడం ఖాయంగా మారిన నేపథ్యంలో.. తలసాని సైతం వెళ్తారా అనే  అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. 
 
సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ఎక్సైజ్ మంత్రి  టి.పద్మారావుతో ఉన్న సాన్నిహిత్యం సైతం తలసాని టీఆర్‌ఎస్‌వైపు వెళ్లే అవకాశాలున్నాయనేందుకు ఆస్కారమిస్తుంది.
 
గతంలోనూ తలసాని టీడీపీలోతాను పొందాలనుకున్న పదవుల్ని పొందడానికి ఇలాంటి అంశాల్ని బాగా రక్తి కట్టించారని పార్టీ నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏదైనా జరగొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డిని సైతం ఐడీహెచ్ కాలనీకి ఆహ్వానించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. తలసాని  స్టైలే వేరని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.
 
అంతకుముందు సనత్‌నగర్‌ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సోమవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. తద్వారా తలసాని టీఆర్ఎస్ పార్థీ తీర్థం పుచ్చుకోవచ్చునని ప్రచారం సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu