Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అట్లకాడతో కాల్చి... బువ్వ కూడా పెట్టదు. నేను ఇంటికెళ్లను.. జడ్జీకి ఐదేళ్ళ బాలిక మొర

అట్లకాడతో కాల్చి... బువ్వ కూడా పెట్టదు. నేను ఇంటికెళ్లను.. జడ్జీకి ఐదేళ్ళ బాలిక మొర
, బుధవారం, 4 మార్చి 2015 (09:09 IST)
‘సార్... అన్నం సరిగా పెట్టదు.. అడిగితే కొడుతుంది. సంక్రాంతి పండుగ రోజు అట్లకాడతో చెయ్యి కాల్చింది. ఇదిగో ఇంకా ఇట్టే ఉంది చూడు.. ఒకసారి నెత్తి మీద కట్టెతో కొడితే నెత్తూరొచ్చింది. నేనా ఇంటికి వెళ్లను.. ఇక్కడే ఉంటాను.’  అంటూ ఐదేళ్ళ వయస్సున బాలిక తన బాధలను మెజిస్ట్రేట్ ఎదుట వాపోయింది. ఆమె మాటలు విన్న జడ్జీ చలించి పోయారు. వివరాలిలా ఉన్నాయి. 
 
నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన  ఐదేళ్ల చిన్నారి మహేశ్వరి తల్లి చాలా కిందట మరణించింది. తండ్రి మరో పెళ్లి చేసుకోవడంతో సవతి తల్లి వద్దే పెరగాల్సిన స్థతి ఏర్పడింది. సవతి తల్లి ఆ చిన్నారికి నరకం ఎలా ఉంటుందో చూపింది. అట్లకాడతో కాల్చింది. తిండి పెట్టకుండా కడుపు మాడ్చింది. ఆడుతూ పాడుతూ కాలం గడపాల్సిన వయసులోనే చిత్ర హింసలకు రుచిచూసింది. ఈ చిన్నారి గురించి పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. 
 
వీటిని చూసి చలించిపోయిన జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ జె.శ్రావణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం స్వయంగా స్థానిక బాలసదన్‌కు వెళ్లి ఆ చిన్నారితో మాట్లాడారు. చిన్నారి శరీరంపై ఉన్న గాయాల గురించి ఒకటొకటిగా అడిగారు. ఆ గాయాల తాలూకు చేదు జ్ఞాపకాలను చిన్నారి అమాయకంగా చెబుతుంటే మేజిస్ట్రేట్ కు గుండెలు పిండేసినట్లయ్యింది. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావుకు ఫోన్‌చేసి వెంటనే బాలసదన్‌కు రావాలని చెప్పారు. 
 
ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి చిన్నారి తండ్రి, సవతి తల్లిని అరెస్టు చేయాలని ఆదేశించారు. మేజిస్ట్రేట్ వెంట చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధి బీవీ సాగర్, మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ కె.లీలావతి, ఐసీడీఎస్ డీసీపీవో ఎన్.జ్యోతి సుప్రియ తదితరులు ఉన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu