Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడో సంతానం కంటే రూ.25 వేలు... 18 యేళ్ల వరకు ఉచిత విద్య : ఏపీ సర్కారు

Advertiesment
chandrababu naidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని  ప్రోత్సహించేందుకు సరికొత్త జనాభా నిర్వహణ విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులోభాగంగా, మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేల ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. 
 
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా పాలసీ వివరాలను సీఎం వెల్లడిస్తూ, మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ.1,000 చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. పిల్లలు కనేవారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (టీఎస్ఆర్) 1.5కు పడిపోయిందని, ఇది ఇలాగే కొనసాగితే జపాన్, ఇటలీ మాదిరిగా వృద్ధుల జనాభా పెరిగి, యువత సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా సమతుల్యత కోసం టీఎస్ఆర్ రేటును 2.1కి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
 
గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) నినాదం ఉండేదని, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా 'పాపులేషన్ కేర్' (జనాభా సంరక్షణ) విధానానికి మారుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఇప్పటికే కూటమి ప్రభుత్వం తొలగించిందని గుర్తుచేశారు. 
 
మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని అనే ఐదు దశల విధానంతో ప్రజలకు అండగా ఉంటామన్నారు. పిల్లలు లేనివారి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ పద్ధతిలో ఐవీఎఫ్ సేవలు అందిస్తామని తెలిపారు. ఈ పాలసీపై నెల రోజులు చర్చించి, మార్చి నెలాఖరుకు ఖరారు చేసి, ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ZP Polls: కొత్త జిల్లాల ఆధారంగా జెడ్పీ ఎన్నికలు.. పవన్ కల్యాణ్