Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ స్పెషల్ స్టేటస్‌పై సస్పెన్స్‌కు తెర..: కర్నూలులో ఉద్యమాల హోరు!

ఏపీ స్పెషల్ స్టేటస్‌పై సస్పెన్స్‌కు తెర..: కర్నూలులో ఉద్యమాల హోరు!
, శనివారం, 2 ఆగస్టు 2014 (13:40 IST)
ఏపీకి స్పెషల్ స్టేటస్‌పై సస్పెన్స్‌కు తెరపడిన నేపథ్యంలో.. రాజధాని కోసం కర్నూలులో ఉద్యమాలు హోరెత్తాయి. మొన్న గ్రేటర్ రాయలసీమ, నిన్న రాయల తెలంగాణ డిమాండ్లతో భారీ ఎత్తున ఉద్యమాలు సాగిన కర్నూలు జిల్లాలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని సాధన ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటికే రాయలసీమ పరిరక్షణ వేదిక తరఫున పెద్ద ఎత్తున కర్నూలు అభివృద్ధి కోసం మాజీ మంత్రి టీజీ గళం విప్పగా, తాజాగా గడచిన ఎన్నికల్లో టీజీని ఓడించిన కర్నూలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు.
 
రాజధాని సాధనలో విజయం సాధిస్తారో, లేదో తెలియదు కాని, అన్నివర్గాలను ఒక్కతాటి మీదకు తేవడంలో ఎస్వీ సఫలమయ్యారనే చెప్పొచ్చు. శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఒక్క టీడీపీ మినహా అన్ని పార్టీలు, సంఘాలు కలసివచ్చాయి. భారీ ఎత్తున ఉద్యమాల కోసం కార్యాచరణనూ ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ భేటీ ప్రకటించింది. 
 
ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధానిగా మూడేళ్ల పాటు కొనసాగిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం నేపథ్యంలో రాజధానిని హైదరాబాద్‌కు వదిలి త్యాగం చేశామనేది కర్నూలు వాసుల భావన. ఈ క్రమంలో భారీ అభివృద్ధిని వదులుకున్న తమను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన పోలేదని వారి ఆవేదన. ఇప్పటికీ అరకొర అభివృద్ధి మినహా, చెప్పుకోదగ్గ కేటాయింపులు లేవని వారు వాదిస్తున్న సంగతీ తెలిసిందే.
 
తాజా ఉద్యమంలో భాగంగా ఈ నెల 11న రాయలసీమకే తలమానికంగా నిలిచిన కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టర్ కార్యాలయం దాకా లక్ష మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని కొత్తగా ఆవిర్భవించిన రాజధాని సాధన సమితి తీర్మానించింది. 13న కర్నూలు బంద్‌తో పాటు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవాలని నిర్ణయించింది. 
 
గతంలో గ్రేటర్ రాయలసీమ, రాయల తెలంగాణల పేరిట ఉద్యమాలు సాగించిన టీజీ, అందులో సఫలం కాలేకపోయారు. మరి ఎస్వీ కూడా ఆయన బాటలోనే నడుస్తారా, లేక రాజధానిని సాధించి చూపిస్తారా అన్న విషయం మరో రెండు, మూడు నెలల్లో తేలిపోనుంది.

Share this Story:

Follow Webdunia telugu