Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంకయ్యా.. ఏపీ ప్రత్యేక హోదాపై మాట మారుస్తారా? ఏంటిది?

వెంకయ్యా.. ఏపీ ప్రత్యేక హోదాపై మాట మారుస్తారా? ఏంటిది?
, సోమవారం, 26 జనవరి 2015 (18:48 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన బీజేపీ నేతలు, ఆర్నెల్లు తిరక్కుండానే తప్పించుకొనే ధోరణి అవలంబిస్తున్నారన్నారు. 
 
ఏపీ ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని, కేంద్రాన్ని తాము నిలదీస్తామని రఘువీరా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 
 
హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రమంత్రి వెంకయ్య నోట ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని చెప్పారు. 
 
ఏపీ ప్రత్యేక హోదా కోసం ‘కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను మేం ఒప్పిస్తాం.. బీజేపీ ముఖ్యమంత్రులను మీరు ఒప్పించండి’ అన్నారు. అన్ని రాష్ట్రాలు అంగీకరించాల్సిన అవసరం లేదని, మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకుంటే చాలన్నారు. విభజన చట్టంలోని అన్ని హామీలను సాధించుకోవడానికి ప్రజా ఉద్యమం చేపడతామని, ఈ నెల 31న ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. 
 
విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని అనుమతులు లేని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో నిర్మించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రఘువీరా చెప్పారు. పర్యావరణానికి హానికరమంటూ పరీవాహక ప్రాంతంలో సామాన్యుల గుడిసెలను తీసేసే ప్రభుత్వాలు.. బీజేపీ కార్యాలయానికి ఎలా అనుమతిచ్చాయని ప్రశ్నించారు.  
 
రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినమాట నిలబెట్టుకోలేని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాను తీసుకురావడంలో విఫలమైన వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి, తక్షణం మంత్రి పదవి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
కేంద్రమే ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఇలాంటి సమయంలో ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే.. ఇతర రాష్ట్రాల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని వెంకయ్య నాయుడు చెప్పడం విచారకరమని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu