పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కొందరు వ్యవహరిస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పవన్ వ్యక్తిగత ప్రతిష్ఠ, హక్కులకు భంగం కలిగించేలా సోషల్‌మీడియా, ఇ-కామర్స్ వేదికలుగా పలు పోస్టులు వైరల్ అవుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయన తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఆ లింక్‌లను 7 రోజుల లోపు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేసింది.
తాను తొలగించాలని కోరుకుంటున్న యూఆర్‌ఎల్స్‌ను సోషల్ మీడియా సంస్థలకు అందించాలని పవన్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అందుకు 48 గంటల సమయం ఇచ్చింది. గతంలో ఇలాంటి ఈ అంశం పైనే పలువురు సినీ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఇలాంటి వారిలో తెలుగు నటులు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ నటులు ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ తదితరులు, క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఉన్నారు.