ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్యయ మధ్య పోటీ కాదనీ, రెండు పార్టీల మధ్య పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. పాలేరు ఉప ఎన్నిక ఈనెల 16వ తేదీన జరుగనున్న విషయం తెల్సిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమన్నారు.
తెరాసను ఒంటరిగా ఎదుర్కోలేని పార్టీలన్నీ ఏకమయ్యాయని విమర్శించారు. ఇపుడు ఆ పార్టీలకు సిద్ధాంతాలు గుర్తుకు రాలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్, టీడీపీలు ఏకం కాలేదనీ, కానీ పాలేరు ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయని విమర్శించారు.
గడిచిన రెండేళ్లుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు పరాజయమేనని, ఓటమికి కాంగ్రెస్ పర్యాయ పదంగా మారిందని ఎద్దేవా చేశారు. సానుభూతి పేరిటి కొత్త తరహా నాటకానికి కాంగ్రెస్ తెరలేపిందన్నారు. తుమ్మల అభ్యర్థిత్వం ఖరారుతో పాలేరు అభివృద్ధిపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందన్నారు.