Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విపక్షాలను రాక్షసులతో పోల్చడమా.. బాబూ ఏంటిది?: ప్రతిపక్షాలు

విపక్షాలను రాక్షసులతో పోల్చడమా.. బాబూ ఏంటిది?: ప్రతిపక్షాలు
, శనివారం, 30 మే 2015 (18:57 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. విపక్షాలను రాక్షసులతో పోల్చడం ఆయనకు తగదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా, ఏనాడూ ఆయన విపక్షాలను పట్టించుకోలేదన్నారు. 
 
అంతేగాకుండా ఏ సమస్యపైనా ఒక్కసారి కూడా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించలేదని రామకృష్ణ ఎత్తిచూపారు. చంద్రబాబుకు విపక్షాలపై గౌరవం లేదని,  నిజంగా గౌరవం ఉంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని నిర్మాణంపై విపక్షాలతో కూడా చర్చించాలని సూచించారు.
 
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు కనీస పరిజ్ఞానం కూడా లేదని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జాతీయ పార్టీ నిబంధనలు తెలియకుండానే బాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరు శాతం ఓట్లు వచ్చిన పార్టీనే జాతీయ పార్టీగా గుర్తిస్తారన్న ఎన్నికల కమిషన్ నిబంధన టీడీపీ అధినేతకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని చెవిరెడ్డి అన్నారు.

జాతీయ పార్టీ అధ్యక్షుడు పదవి కంటే టీడీపీ అంతర్జాతీయ అధ్యక్షుడిగా బాబు ప్రకటించుకుంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో బాబుకు భారతరత్న ప్రదానం చేయచ్చని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
 
అలాగే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ లో ఉన్న లక్షణాల్లో ఏ ఒక్కటీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడులో లేదని టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకే మహానాడును హైదరాబాదులో పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రతి రైతుకీ రుణమాఫీ జరిగింది, మరి ఏపీలో అలా జరిగిందా? అని ప్రశ్నించారు. 
 
చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఖబడ్దార్ అనేంత దమ్ముందా? అని ఆయన సవాలు విసిరారు. ఏపీలో చంద్రబాబు అరాచకవాదిగా మారాడని ఆయన విమర్శించారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు మహానాడు నిర్వహించి ప్రతిపక్షాల నోట నానుతున్నారు. మహానాడులో ఆయన ప్రసంగంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరి విపక్షాల కోపాన్ని చల్లార్చేందుకు చంద్రబాబు ఏమేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu