Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంత లేదు... అక్టోబర్ 31 నాటికి ఎన్నికలకు సిద్ధంకండి.. జిహెచ్ ఎంసికి హైకోర్టు ఆదేశం.

అంత లేదు... అక్టోబర్ 31 నాటికి ఎన్నికలకు సిద్ధంకండి.. జిహెచ్ ఎంసికి హైకోర్టు ఆదేశం.
, మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (07:46 IST)
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించడానికి అంత సమయం దేనికి? వీలు కాదు. ఆరు నెలలు గడువిస్తున్నాం. అక్టోబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితులలో ప్రక్రియ పూర్తి చేయండి. ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేయాలంటూ రాష్ట్ర హైకోర్టు జిహెచ్ ఎంసిను ఆదేశించింది. సోమవారం వాదోపవాదనలు విన్న హైకోర్టు ఆ విధంగా తీర్పు చెప్పింది. వివరాలిలా ఉన్నాయి. 
 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసేందుకు 219 రోజులు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అక్టోబర్ 31 నాటికి ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గడువును పొడిగించే సమస్యే లేదని తేల్చి చెప్పింది. ఆ తరువాత 45 రోజులకల్లా అంటే డిసెంబర్ 15 నాటికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
 
జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరడంతోపాటు, స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని సవాలు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో ఉన్న 150 వార్డులను 200కు పెంచామని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించామని, డిసెంబర్‌కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. చేయాల్సిన పనులు చాలా ఉండటంతోనే 219 రోజుల గడువు కోరుతున్నామని ఆయన వివరించారు. 
 
తరువాత పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం చెప్పిన ప్రక్రియలన్నింటినీ పూర్తి చేయడానికి 158 రోజులు సరిపోతాయన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, 219 రోజుల గడువు సమంజసం కాదని తేల్చి చెప్పింది. ఆరు నెలల్లో మొత్తం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియలన్నింటినీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, కనీసం ఏడు నెలల గడువన్నా ఇవ్వాలని అభ్యర్థించగా, ధర్మాసనం సున్నితంగా తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
 

Share this Story:

Follow Webdunia telugu