విజయవాడలో మహిళ గృహ నిర్బంధం- నేనున్నానంటూ నన్నపనేని
అన్నదమ్ముల మధ్య ఆస్తుల గొడవలు ఉన్నాయి. న్యాయస్థానంలో వివాదాలు నడుస్తున్నాయి. అక్కడ తేలాల్సిన వ్యవహారం తమకు అనుకూలంగా తేలడం లేదనో, లేదంటే తేలే వరకు ఆగలేకనో ఓ వర్గం బెజవాడ పోలీసులను ఆశ్రయించింది. అంతే... పోలీసుల సహకారంతో తమ ప్ర
అన్నదమ్ముల మధ్య ఆస్తుల గొడవలు ఉన్నాయి. న్యాయస్థానంలో వివాదాలు నడుస్తున్నాయి. అక్కడ తేలాల్సిన వ్యవహారం తమకు అనుకూలంగా తేలడం లేదనో, లేదంటే తేలే వరకు ఆగలేకనో ఓ వర్గం బెజవాడ పోలీసులను ఆశ్రయించింది. అంతే... పోలీసుల సహకారంతో తమ ప్రత్యర్థుల ఇంటికి వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్నవారిని చితకబాది ఇల్లు ఆక్రమించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ఇంటి ఇల్లాలు భయంతో ఇంట్లో తలుపు పెట్టుకుని ఉండిపోయింది. ఈ 5 రోజులు అన్నం లేదు... నీళ్లు లేవు. బెజవాడలో పోలీసులు, బంధువుల బెదిరింపులతో భయపడిపోయి హౌస్అరెస్ట్ అయిన ఓ భారతీ కథ ఇది.
గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కిష్కందపాలెంకు చెందిన కొల్లి వెంకట పద్మనాభంకు ముగ్గురు కొడుకులు. వారిలో చదువుకున్న వాడైన బుచ్చికోటయ్య ఉమ్మడి మీద విజయవాడలో కృష్ణవేణి ఫౌల్ట్రీ నీడ్స్ పేరుతో వ్యాపారం చేశాడు. దాని తాలుకా లాభాలను అన్నలకు పంచకుండా ఒక్కడే తీసుకున్నాడని, ఇదంతా న్యాయస్థానాల్లో వివాదాలు నడుస్తున్నాయి. అయితే ఏమైందో ఏమో కాని కొంతమందిని వెంటపెట్టుకుని బుచ్చికోటయ్య అన్నలు విజయవాడలోని అతని ఇంటిపై దాడికి దిగారు. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు.
దీంతో బుచ్చికోటయ్య భార్య భారతీదేవి ప్రాణ భయంతో ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంది. తనకు ప్రాణ భయం ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయినా వారు పట్టించుకోలేదు. ఇంటి బయట ఉన్న బుచ్చికోటయ్య అన్నలు వారి బంధువులు ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తుండటంతో భారతీ తలుపు కూడా తీయలేదు. ఈ విధంగా 5 రోజులు గడిచిపోయింది. పోలీసులు పట్టించుకోవడం లేదు, భారతికి అన్నపానీయాలు కూడా అందడం లేదు. చివరకు ఆమె పూర్తిగా నీరశించి పోయింది.
ఈ విషయాన్ని కొంతమంది మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే ఆమె స్పందించి పోలీసులకు ఫోన్ చేసి విచారణ చేశారు. ఇల్లు ఎవరి పేరుతో ఉందో ఎంక్వయిరీ చేశారు. ఇల్లు భారతి పేరు మీదనే ఉంది. ఇంటికి సంబంధించి వివాదాలు కూడా ఏమి లేవని పోలీసులు చెప్పారు. అటువంటప్పుడు ఇంటికి సంబంధం లేని వాళ్ళు వచ్చి ఇంట్లో బయట ఎందుకుంటున్నారని రాజకుమారి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత రాజకుమారి ఈ విషయాన్ని నేరుగా హోం మంత్రి చిన్నరాజప్పకు తెలియజేస్తే ఆయన కూడా విచారణ చేసి ఇంటి విషయంలో వివాదం లేదని... భారతీకి పోలీసులు రక్షణ కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఇది జరిగిన 24 గంటల తర్వాత కూడా భారతీ ఇంట్లోనే నిర్భంధంలో ఉండటంతో చివరకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్వయంగా భారతీ ఇంటికి వచ్చి ఆమెకు అండగా నిలిచారు.
బెజవాడ పోలీసుల తీరుపై నన్నపనేని రాజకుమారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు అమ్ముడుపోయారంటూ దుయ్యబట్టారు. చివరకు హోం మంత్రి చెప్పినా వినని స్థాయికి పోలీసులు వెళ్ళిపోయారంటే, అవతలి వర్గం నుంచి ఎంత తీసుకున్నారోనని సందేహం వ్యక్తం చేశారు. దీనిని బట్టి బెజవాడ పోలీసులు పని తీరు ఎలా ఉందో ఇక అంచనా వేయడం కూడా అనవసరమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.