నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపు రేఖలు శరవేవంగా మారిపోనున్నాయి. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులను శరవేగంతో పూర్తి చేసేలా ప్రణాళికలు రచించి, వాటిని అమలు చేస్తే సత్వర నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులోభాగంగా, గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి పచ్చజెండా ఊపారింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సచివాలయంలో ఏకంగా రెండున్నర గంటల పాటు సాగిన ఈ మంత్రివర్గ సమావేశంలో44 అజెండాలకు ఆమోదం తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు.
ముఖ్యంగా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, రాజధాని అమరావతిలో లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్‌లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం అంగీకారం లభించిందని వెల్లడించారు.
అలాగే, సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు రూ.532కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు చెప్పారు. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.
రాష్ట్రపెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 26సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఆమోదం తెలిపిన దాదాపు రూ.20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా 56 వేల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగనుందని మంత్రి పార్థసారథి తెలిపారు.