Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెల్మెట్ ధరించలేదో... జేబు ఖాళీ... రేపటి నుంచి తప్పనిసరి

హెల్మెట్ ధరించలేదో... జేబు ఖాళీ... రేపటి నుంచి తప్పనిసరి
, శుక్రవారం, 31 జులై 2015 (08:35 IST)
ఇంతకాలం హెల్మెట్ లేకుండా కాలం గడిపేశాం... ఎలా వెళ్ళినా అడిగే వారు లేరనే ధీమాతో అలా వెళ్ళిపోయాం. అయితే ఆ ఆటలకు ఇక కాలం చెల్లింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే తిప్పలు తప్పవు.. జేబులు ఖాళీ కాక తప్పదు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనను శనివారం నుంచి అమలులోకి తీసుకురానున్నది. 
 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అధ్యక్షతన గురువారం రహదారి భద్రత కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రహదారి ప్రమాదాల్లో గాయపడ్డవారిని తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించినప్పుడు ఉచితంగా వైద్య సేవలు, అవసరమైతే శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందనీ ఈ విషయంపై ప్రజల్లోనూ, వైద్య సంస్థల్లోనూ తగిన అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టాలని ఐవైఆర్‌ సూచించారు. 
 
ఉచిత వైద్యం చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సంస్థలు నిరాకరించిన పక్షంలో వాటి అనుమతులను రద్దు చేయవచ్చని స్పష్టం చేశారు. రహదారి భద్రత అంశంపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వీటిని అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాల్సిందిగా వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి సూచించారు. 
 
హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే పోలీసులు వెంబడించి మరీ జరిమానా విధిస్తారు. అయితే బైకు నడిపే వారికే కాకుండా వెనుకున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేశారు. ఇప్పటికే చాలా మంది జనం హెల్మెట్లు కొనేశారు.

Share this Story:

Follow Webdunia telugu