Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈవ్-టీజింగ్ చేశారో అంతే!: షి పేరిట 100 బృందాలు!

ఈవ్-టీజింగ్ చేశారో అంతే!: షి పేరిట 100 బృందాలు!
, శనివారం, 25 అక్టోబరు 2014 (13:24 IST)
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో యువతులకు, మహిళలకు రక్షణ కల్పించి, పురుషుల వేధింపుల నుంచి వారిని కాపాడే దిశగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మహిళా రక్షణ కోసం 100 మహిళా బృందాలను రంగంలోకి దించారు. 
 
స్త్రీలకు అండగా, రక్షణగా ‘షి' బృందాలను ఏర్పాటు చేసి వారి భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది. షి బృందాల ఏర్పాటు విషయాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
 
క్రైం అడిషనల్‌ కమిషనర్‌ స్వాతిలక్రా ఆధ్వర్యంలో పనిచేసే ఈ బృందాల్లో అందరూ మహిళా పోలీసులే ఉంటారు. నగరంలో ఇలాంటి 100 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో వెల్లడించారు. 
 
ఒక్కో బృందంలో ఐదుగురు మహిళా పోలీసులు ఉంటారు. వీరంతా సాధారణ డ్రెస్‌లోనే ఉంటారు. బస్టాపులు, రైల్వేస్టేషన్లు, ఆటోస్టాండ్ల వద్ద, కళాశాలల వద్ద నిఘా వేస్తారు.
మహిళలను వేధింపులకు గురి చేసిన వారిని తక్షణమే అదుపులోకి తీసుకుంటారు.
 
ఆపదలో ఉన్నప్పుడు వెంటనే 100కు ఫోన్‌ చేస్తే తక్షణ సాయం అందిస్తామని మహేందర్‌రెడ్డి మహిళలకు సూచించారు. ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడుతూ షి బృందాలకు పట్టుబడిన వారు జాగ్రత్తగా ఉండకపోతే వారిపై క్రైమ్‌షీట్‌ తెరుస్తారు. ఆ వివరాలు అన్ని పోలీస్‌స్టేషన్లలో అందుబాటులో ఉండేలా సెంట్రల్‌ డేటాలో పొందుపరుస్తారు.
 
ఈవ్‌టీజర్ల తల్లిదండ్రులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తారు. చట్ట ప్రకారం శిక్షించడమే కాకుండా, మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేస్తారు. ఈవ్‌టీజర్లపై నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఐపీఎస్‌ స్వాతి లక్రా భరోసా ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu