Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బావిలో గున్న ఏనుగు...! చెట్లు విరిచి.. పొలాలు తొక్కేసి.. శివాలెత్తిన గజరాజులు.. ఎక్కడ?

బావిలో గున్న ఏనుగు...! చెట్లు విరిచి.. పొలాలు తొక్కేసి.. శివాలెత్తిన గజరాజులు.. ఎక్కడ?
, సోమవారం, 24 ఆగస్టు 2015 (12:48 IST)
మన పిల్లాడికి ఏదైనా ప్రమాదం జరిగితే విల విలాడిపోతాం. కోపం, ఆగ్రహం, బాధ అన్ని కలబోసి వెళ్ళగక్కుతాం. ఇక ఏనుగు పిల్లకు ఏదైనా హాని తలపెడితే... అవి కూడా అలాగే వ్యవహరిస్తాయి. గున్న ఏనుగు ఒకటి బావిలో పడడంతో ఏనుగుల మంద కోపంతో ఊగిపోయింది. గజరాజులు శివాలెత్తిపోయాయి.  దొరికిన చెట్టునల్లా విరిచేశాయి. పంటపొలాలను నాశనం చేశాయి. చివరకు అటవీశాఖ అధికారులు రంగ ప్రవేశం చేసి గున్న ఏనుగును బయటకు తీశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.  
 
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీరనామల తాండ సమీపంలో ఏనుగుల మందను గ్రామస్తులు, అటవీశాఖ అధికారులు అడవి ప్రాంతంలోకి మళ్ళిస్తున్నారు. పంట పొలాలపై దాడి చేస్తుండడంతో వాటిని తోలుతున్నారు. అయితే ఓ చదునైన ప్రదేశంలో పరుగులు పెడుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ 20 అడుగుల బావిలో అదుపు తప్పి ఓ గున్నేను పడిపోయింది. 
 
దాంతో గజరాజులకు ఎక్కడ లేని కోపం వచ్చింది. పెద్ద ఎత్తున ఘీంకరిస్తూ..పక్కనే ఉన్న చెట్లను విరిచేశాయి. పంట పొలాలను నాశనం చేశాయి. చాలాసేపు అక్కడే గందరగోళం సృష్టించాయి. తరువాత అడవుల్లోకి వెళ్ళిపోయాయి. చివరకు అటవీశాఖ అధికారులు అక్కడ చేరుకుని బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి గున్న ఏనుగును బయటకు తీశారు. ఏనుగులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి వాటిలో కలిపేశారు. 
 
 

Share this Story:

Follow Webdunia telugu