Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ స్పెషల్ స్టేటస్‌పై కథలు చెప్తున్న ఎంపీలు: చెవ్వుల్లో పువ్వులు పెడ్తున్నారా?

ఏపీ స్పెషల్ స్టేటస్‌పై కథలు చెప్తున్న ఎంపీలు: చెవ్వుల్లో పువ్వులు పెడ్తున్నారా?
, శనివారం, 1 ఆగస్టు 2015 (11:49 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పినప్పటికీ.. టీడీపీ ఎంపీలు మాత్రం స్పెషల్ స్టేటస్‌పై కథలు చెప్తున్నారు. ఇకపై దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఛాన్సు లేదని, 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక, సాధారణ అంటూ రాష్ట్రాల మధ్య తేడాలను ప్రస్తావించలేదని కేంద్రం శుక్రవారం ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ అధికార పక్ష నేతలు మాత్రం ఇంకా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు దీనిపై మాట్లాడుతూ... కేంద్రం చేసిన ప్రకటన మనకు వర్తించదన్నారు. ఏపీ పరిస్థితి చాలా ప్రత్యేకమని, కేంద్రం ప్రకటనతో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ముడిపెట్టరాదని సూత్రీకరించారు. రాజ్యసభలో బీజేపీ స్పష్టంగా చెప్పిన మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
అటు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏమంటున్నారంటే... రంగరాజన్ కమిటీ సిఫారసులు అమల్లో ఉన్నాగానీ, తాము ప్రత్యేక హోదా కోసం శ్రమిస్తున్నామని, కేంద్రం కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై కసరత్తులు చేస్తోందన్నారు. అయితే, ఎంపీ కొనకళ్ల మాత్రం భిన్న స్వరం వినిపించారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతున్నామని, అది సాధ్యం కాకపోతే ప్రత్యేక హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీ అడుగుతామన్నారు.
 
ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీల మాటలు నమ్మశక్యం కావట్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రులకు పట్టిన గతే.. స్పెషల్ స్టేటస్ విషయంలోనూ పునరావృతం కానుందని వారు జోస్యం చెబుతున్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తుందని కథలు చెప్తే నమ్మేందుకు ప్రజలు వెర్రిపప్పలు కాదని, రాజకీయ నేతలు కేంద్రంతో పోరాడి హోదా తెచ్చుకోకుండా.. ఇలా చెవుల్లో పువ్వులు పెట్టవద్దని రాజకీయ విశ్లేషకులు హితవు పలికారు. మరి ఎంపీలు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.  

Share this Story:

Follow Webdunia telugu