Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరెస్టులతో అడ్డుకట్ట: సీపీఐ సభను భగ్నం చేసిన పోలీసులు!

అరెస్టులతో అడ్డుకట్ట: సీపీఐ సభను భగ్నం చేసిన పోలీసులు!
, సోమవారం, 22 సెప్టెంబరు 2014 (09:56 IST)
ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభను పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల నేతలు, సానుభూతి కార్యకర్తలు రాజధానిలో సభ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. 
 
సభలో పాల్గొనడానికి వచ్చిన వారిని శనివారం రాత్రి నుంచే ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. సభలో పాల్గొనేందుకు వచ్చి కాచిగూడ తుల్జార్ భవన్‌లో బస చేసిన జార్ఖండ్ రాష్ట్ర ప్రజా గాయకుడు జీత్ మరాండీ, పినాకపాణి, పద్మకుమారి, వరలక్ష్మితోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వీరితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విరసం నేత కళ్యాణ్‌రావును గుంటూరు జిల్లాలో అరెస్టు చేశారు. దీంతో ఆదివారం హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సభకు అటు పోలీసు శాఖ అనుమతించలేదు. దీంతో వరవరరావు హైకోర్టును ఆశ్రయించగా సభ నిర్వహణకు హైకోర్టు కూడా అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ సభ నిర్వహించి తీరుతామని సభ నిర్వాహకులు, విరసం నేతలు ప్రకటించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి విబి కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా బలగాలు మోహరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్లే అన్ని మార్గాలను బారీకేడ్లు, ముళ్లకంచెలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 
 
ఇలాఉండగా సభకు హాజరయ్యేందుకు విరసం నేతలు వరవరరావుతోపాటు మరో 20 మంది సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు బయలుదేరారు. అప్పటికే భారీగా మోహరించి ఉన్న పోలీసులు బలగాలు వారిని అడ్డుకున్నాయి. సభకు అనుమతి లేదని వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్‌లకు తరలించారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, సభ నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu