Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

Advertiesment
chandrababu naidu

ఠాగూర్

, శనివారం, 6 డిశెంబరు 2025 (18:03 IST)
సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చిన్న విషయం అయినప్పుడు ఇక పరకామణి చోరీ కేసు ఓ లెక్కనా అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తిరుమల పరకామణిలో రూ.70 వేల చోరీకి రూ.14 కోట్ల ఆస్తి రాసిచ్చేందుకు సిద్ధపడ్డారంటే ఇంకెంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు. తితిదే దోపిడీ ఏ స్థాయిలో చేశారో దీనిబట్టే అర్థమవుతోందన్నారు.
 
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్‌కు దేవుడన్నా, ఏడుకొండల వాడి భక్తుల మనోభావాలు అన్నా, ఆలయాలు పవిత్రత అన్నా లెక్కలేదని దుయ్యబట్టారు. బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందాం అని చూసిన జగన్, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం ఘోరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
దొంగతనాన్ని కూడా తప్పు కాదు అని చెప్పే వాళ్లను ఏమనాలని ప్రశ్నించారు. సెంటిమెంట్ విషయాల్లో కూడా సెటిల్మెంట్ అంటూ వ్యాఖ్యాలా అని ఆక్షేపించారు. నేరస్తుల్ని వెనకేసుకొస్తాను అంటూ సమాజానికి ఏం చెప్తూన్నారని నిలదీశారు. దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు వెనక్కి కట్టాడు కదా, తప్పేముంది అని జగన్ అత్యంత అనైతికంగా వాదిస్తున్నాడని మండిపడ్డారు. భక్తులు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గుర్తుచేశారు. 
 
శ్రీవారి ఆలయంలో ప్రతి అంశంలోనూ భక్తుల సెంటిమెంట్ ముడిపడి ఉంటుందన్న చంద్రబాబు.. అలాంటి సున్నిత అంశాలను కూడా సెటిల్ చేశాం అని తేలిగ్గా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏంటి అని ప్రశ్నించారు. శ్రీవారి హుండీలో చోరీపై జగన్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజల్లోను తీవ్ర ఆవేదన కనిపిస్తోందన్నారు. వర్గాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఆ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవుడి హుండీలో చోరీని సెటిల్ చేయటానికి జగన్ ఎవరని నిలదీశారు. కోట్ల మంది భక్తులు విశ్వాసాలు దెబ్బతీసేలా పరకామణి విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఘోర పాపం కాదా అని మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండిగోతో కష్టాలు.. ప్రయాణీకులకు మేమున్నాం అంటోన్న ఎయిర్ ఇండియా, AI Express