Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నైలో తెలుగు యువకుడి అపహరణ... 24 గంటల్లోపే పట్టేశారు...

చెన్నై: నగర శివారులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును అపహరించిన ముఠా రూ.కోటి డిమాండ్‌ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నాటకీయంగా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు సదరు బాధితుడికి మిత్రులు కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్

చెన్నైలో తెలుగు యువకుడి అపహరణ... 24 గంటల్లోపే పట్టేశారు...
, శనివారం, 30 జులై 2016 (19:40 IST)
చెన్నై: నగర శివారులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును అపహరించిన ముఠా రూ.కోటి డిమాండ్‌ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నాటకీయంగా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు సదరు బాధితుడికి మిత్రులు కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం... తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన దేవరాజ్‌ కుమారుడు ప్రేమ్‌కుమార్‌ (28) తమిళనాడులోని కాంచీపురం జిల్లా నావలూర్‌లో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. 
 
గురువారం తెల్లవారుజామున విధులు ముగించుకుని కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. కేళంబాక్కంలోని తన గదికి వెళ్లేందుకు లిఫ్ట్‌ అడిగి ఓ కారులో ఎక్కారు. అందులోని నలుగురు వ్యక్తులు ప్రేమ్‌కుమార్‌ను నిర్బంధించారు. రూ. కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అతడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. భయాందోళనలకు గురైన వారు వెంటనే చెన్నై పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఉత్తర జోన్‌ ఐజీ సెంతామరైకన్నన్‌, కాంచీపురం ఎస్పీ ముత్తరసి తదితరులు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రేమ్‌కుమార్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసిన కిడ్నాప్‌ ముఠా సభ్యులు డబ్బు గురించి హెచ్చరించారు. తమ వద్ద అంత డబ్బు లేదని, ప్రస్తుతం రూ.లక్ష మాత్రమే ఉన్నట్లు ప్రేమ్‌కుమార్‌ తల్లిదండ్రులు సమాధానం ఇచ్చారు. ఆ డబ్బును ప్రేమ్‌కుమార్‌ గదిలోని సందీప్‌ అనే యువకుడికి ఇచ్చి కేళంబాక్కం బస్టాండుకు పంపాలని దుండగులు తెలిపారు. 
 
అప్రమత్తమైన పోలీసు అధికారులు సందీప్‌కు బదులుగా రూ.లక్ష నగదుతో ఓ పోలీసును పంపారు. అతణ్ని అనుసరించేలా మరో బృందాన్ని సిద్ధం చేశారు. కిడ్నాప్‌ ముఠా మాత్రం కేళంబాక్కం బస్టాండుకు రాలేదు. రెండుసార్లు స్థలాలు మార్చి ఎట్టకేలకు ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులోని కోవళం రోడ్డు జంక్షన్‌కు రావాలని చెప్పింది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు తిరుగుతూనే ఉన్న పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం తెల్లవారుజామున కోవళం రోడ్డు జంక్షన్‌లో డబ్బు తీసుకోవడానికి వచ్చిన ఇద్దర్ని పట్టుకున్నారు. 
 
దర్యాప్తులో వాళ్లు తైయూర్‌ పెరియమానగర్‌కు చెందిన పార్తిబన్‌, జయశీలన్‌గా తెలిసింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు తైయూర్‌లోని ఓ అపార్ట్‌మెంటులో బందీగా ఉన్న ప్రేమ్‌కుమార్‌ను విడిపించారు. ఈ సందర్భంగా కేళంబాక్కానికి చెందిన ప్రవీణ్‌ బాలాజీ, అరక్కోణానికి చెందిన వివేక్‌రాజ్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ ప్రేమ్‌కుమార్‌కు స్నేహితులని విచారణలో వెల్లడైంది. డబ్బుకు ఆశపడి ఈ కిడ్నాప్‌కు ఒడిగట్టారని దర్యాప్తులో తెలిసింది. అప్పటివరకు ఉత్కంఠ రేకెత్తించిన కిడ్నాప్‌ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెళ్లిపొమ్మంటే వెళ్ళిపోమా.. ఇది మీకు తగునా... వెంకయ్యపై గాలి ఫైర్