Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: చంద్రబాబు వార్నింగ్

నల్ల బజారు విక్రయాలను ప్రోత్సహించే అక్రమ వ్యాపారులు, మధ్య దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బుధవారం తన నివాసం నుంచి పౌర సరఫరాలు, ఉద్యాన, వ్యవసాయ శాఖలు, రైతుబజార్ల అధికారులు, జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్

కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: చంద్రబాబు వార్నింగ్
, బుధవారం, 12 జులై 2017 (21:16 IST)
నల్ల బజారు విక్రయాలను ప్రోత్సహించే అక్రమ వ్యాపారులు, మధ్య దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బుధవారం తన నివాసం నుంచి పౌర సరఫరాలు, ఉద్యాన, వ్యవసాయ శాఖలు, రైతుబజార్ల అధికారులు, జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిత్యావసరాలు, కూరగాయల ధరల నియంత్రణపై అధికారులు పూర్తి దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. అధిక ధరలకు విక్రయించేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 
 
కూరగాయలు, ఇతర నిత్యావసరాలకు ఎటువంటి కొరత లేకుండా చూడాలని కోరారు. నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు కృషి చేయాలన్నారు. కూరగాయల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని, కూరగాయల విత్తనాలను సబ్సిడిపై పంపిణీ చేయాలని, సూక్ష్మ పోషకాలను ఉచితంగా అందజేయాలని సూచించారు.
 
రోజువారీగా ధరలను పర్యవేక్షించాలి
ప్రతిరోజూ నిత్యావసరాల ధరలను పౌర సరఫరాల అధికారులు పర్యవేక్షించా లని, ఎప్పటికప్పుడు ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బహిరంగ మార్కెట్ లో ఏ సరుకుకూ కొరత లేకుండా చూడాలన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా గత ఏడాది కందులు, ఉల్లి ధరలను నియంత్రించిన విషయం గుర్తుచేశారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా అవసరాన్ని బట్టి మార్కెట్ జోక్యం ద్వారా నిత్యావసరాల ధరలకు కళ్లెం వేయాలన్నారు. 
 
పేద, మధ్య తరగతి ప్రజలపై అధిక ధరల భారం పడకుండా చూడాలన్నారు. రైతు బజార్ల వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ఉద్యాన శాఖ అధికారులు, రైతుబజార్ల సిబ్బంది సమన్వయంగా పనిచేయాలన్నారు. ఉత్పత్తి పెంచడంపై హార్టీకల్చర్, సక్రమంగా సరఫరా చేయడంపై సివిల్ సప్లైస్ శాఖ శ్రద్ద వహించాలన్నారు. మదనపల్లిలో రైతుల వద్ద కిలో టమాటా రూ.52 చొప్పున కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకు అందుబాటులో ఉంచాలన్నారు. ఉత్పత్తి తక్కువ ఉండటం వల్లే టమాటా ధర పెరిగినట్లుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
 
అటు రైతులకు,ఇటు వినియోగ దారులకు మేలు కలగాలి: 
‘‘రైతులకు మంచి ధర రావాలి, అదే సమయంలో వినియోగదారులకు ప్రయోజనం చేకూరాలి, ఉభయ తారకంగా ఉండాలని’’ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అటు రైతులకు,ఇటు వినియోగ దారులకు మేలు కలగాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంటూ మధ్య దళారుల దోపిడీని మాత్రం సహించేది లేదన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జిఎస్‌టికి ముందు, తరువాత ధరలలో వచ్చిన వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తున్నట్లుగా తెలిపారు. సెలెక్టెడ్ ఛానల్ పేరుతో సినిమా థియేటర్లు, పెద్దపెద్ద మాల్స్‌లో మంచినీటి సీసాలు, శీతల పానీయాలు అధిక ధరలకు విక్రయించడంపై తనిఖీలు జరిపి అక్రమ విక్రయాలను నియంత్రించామన్నారు.
 
ఈ టెలికాన్ఫరెన్స్‌లో మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ మల్లికార్జునరావు, ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి, రైతుబజార్ల సిఈవో రమణ మూర్తి, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలెక్టర్ మీనా చేయి పట్టుకున్న ఎమ్మెల్యే... కేసీఆర్ ఆగ్రహం