Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి.. రాజధాని నిర్మాణం ఆగదు : చంద్రబాబు

ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి.. రాజధాని నిర్మాణం ఆగదు : చంద్రబాబు
, మంగళవారం, 27 జనవరి 2015 (15:36 IST)
విభజన చట్టం మేరకు ప్రత్యేక హోదాను పొందేందుకు కేంద్రపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడిచారు. తన దావోస్ పర్యటనపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో గేట్ వే ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చెందుతుందన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నామనీ, నవ్యాంధ్ర రాజధాని విషయంలో రైతులు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఎవరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా రాజధాని నిర్మాణ ప్రక్రియ ఆగదని ఆయన తేల్చి చెప్పారు. ఇకపోతే.. మన దేశం పట్ల, రాష్ట్రం పట్ల పెట్టుబడిదారులు సానుకూలంగా ఉన్నారని తెలిపారు.
 
దావోస్ సదస్సుకు అమెరికా తర్వాత ఎక్కువమంది ప్రతినిధులు మనదేశం నుంచి వచ్చారని చెప్పారు. దావోస్ పర్యటనలో సాంకేతిక నిపుణులు, తయారీ రంగ దిగ్గజాలను కలిసినట్టు చెప్పారు. వాల్‌మార్ట్ 5 అంశాల్లో సహకరిస్తానని హామీ ఇచ్చిందని చెప్పారు. ఈ గవర్నెన్స్‌లో విప్రోతో కలసి జాయింట్ వెంచర్ ప్రారంభిస్తామని, మార్చిలో శ్రీ సిటీలో పెప్సికో యూనిట్ ఏర్పాటవుతుందని తెలిపారు. 
 
స్విస్‌ పర్యటనలో మొత్తం 35 ఈవెంట్లలో పాల్గొనన్నానని, బిల్‌గేట్స్‌తో సహా వాల్‌వర్ట్‌, గూగుల్‌, లూలూ, ఇన్ఫోసిస్‌, తదితర వ్యాపార సంస్థల ప్రతినిధులతో మాట్లాడినట్టు చెప్పారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండింగ్‌ ఇచ్చేందుకు వాల్‌మార్ట్‌ అంగీకరించిందన్నారు. అలాగే, హిందూపురంలో సంతూరు కంపెనీని విస్తరించాలని ఆ సంస్థ భావిస్తోందని చెప్పారు.
 
ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోందని, ఏ ఇద్దరు కలిసినా ఇండియా గురించే మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. మన దేశంలో ఉన్న యువత ఏ దేశంలోనూ లేదని, ప్రపంచానికి మన మీద పూర్తి నమ్మకం ఉందన్నారు. సహజ వనరులు, స్థిరమైన ప్రభుత్వం మన దేశ ప్రత్యేకతలు అని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu