Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు 'కేపిటల్' బిజినెస్ చేస్తున్నారా...? ఆ సలహా సంఘం అందుకేనా...?

చంద్రబాబు 'కేపిటల్' బిజినెస్ చేస్తున్నారా...? ఆ సలహా సంఘం అందుకేనా...?
, సోమవారం, 21 జులై 2014 (17:32 IST)
వడ్డించేవాడు మనవాడైతే బంతి ఆఖర్న వెళ్లినా అన్నీ వేస్తారని లోకం నానుడి. ఈ తీరుగనే వుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహారం. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎక్కడన్నదీ ఇంకా తేలకుండానే దానికో సలహా సంఘం వేసిపారేశారు చంద్రబాబు. సలహా సంఘంలో అంతా చంద్రబాబు అస్మదీయులే. పైగా వారంతా వ్యాపార వాణిజ్య లావాదేవీల్లో నిండా తలమునిగిన బడా బాబులు. 
 
జీఎంఆర్ సంస్థల అధ్యక్షుడు గ్రంథి మల్లికార్జున రావు, జీవికే వ్యవస్థాపక అధ్యక్షుడు జీవీకే రెడ్డి, సుజనా కంపెనీ ఛైర్మన్ , ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, నూజివీడు సీడ్స్ అధినేత ఎం ప్రభాకరరావు, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణలతో కూడిన సలహా సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నారు. సలహా సంఘంలో వున్నవారంతా వ్యాపారవేత్తలే కావడంతో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు ఏవిధంగా ఉండబోతోందో అర్థమవుతూనే వుంది.
 
బిజినెస్‌ చేసుకునేవాళ్లకే రాజధాని ఎలా ఉండాలో తెలుస్తుందా..? 
3 కోట్ల బిల్లు వచ్చే దగ్గర 300 కోట్లు వచ్చేలా ప్రణాళికలు చేయడం వ్యాపారవేత్తల సహజ లక్షణం. కాంట్రాక్టర్లకు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటానికి ఇంజనీర్లు, రిటైర్డ్‌ ఇంజనీర్లు, సీనియర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్లను కాకుండా వ్యాపారవేత్తలను సలహా సంఘంగా నియమించడాన్ని కొందరు మేధావులు ప్రశ్నిస్తున్నారు. 
 
నూతన రాజధాని నిర్మాణాన్ని బాబు కోటరీ తనకు కామధేనువులా మార్చుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. రాజధాని ఎక్కడో తెలిసినా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయటం లేదు. అధికారపార్టీ ఈ అంశాన్ని కూడా తమ బిజినెస్‌ బ్యాచ్‌కి అనుకూలంగా వాడుకుంటుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎక్కడెక్కడో ఏవి వస్తాయో నిర్ణయించుకుని అక్కడ భూములు కొనిపెట్టుకుని తీరిగ్గా ఆగస్టులో ప్రకటనలు చేయాలని చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని సలహా సంఘం పేరుతో వేసిన ఈ కమిటీ.. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కేపిటల్‌ బిజినెస్‌ గురించి చెప్పకనే చెప్పిందనే విమర్శలు వినపడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu