వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి పి.నారాయణ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని రివర్ బేసిన్‌లో నిర్మిస్తున్నారంటూ జగన్ మోహన్ రెడ్డి తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పైగా, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొంటే అదే రాజధాని అవుతుందంటూ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో మండపడుతున్నారు. కోట్లాది మంది ప్రజలు ఉండే నవ్యాంధ్రకు రాజధాని అక్కర్లేదని జగన్ అంటున్నారన్నారు. మరి ఆయనకు మూడు రాష్ట్రాల్లో ప్యాలెస్‌లు ఎందుకు, ఒక్కచోట ప్యాలెస్ కట్టుకుంటే సరిపోదా అని ప్రశ్నించారు.
అంతేకాకుండా, ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలెన్నో నదీ ఒడ్డున ఉంటే.. నదీ గర్భంలో అమరావతి అని జగన్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. రివర్ బెడ్‌కి రివర్ బేసిన్‌కు జగన్ తేడా తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్, అమరావతి సచివాలయాలను పోల్చి విమర్శలు చేస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు.
హైదరాబాద్ సచివాలయం మంత్రులు, కార్యదర్శులకే పరిమితమని నారాయణ గుర్తుచేశారు. అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో పాటు శాఖాధిపతులు, వారి సిబ్బంది కూడా ఒకే చోట ఉంటారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో అమరావతి నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు.