Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు సర్కారుకు షాక్.. అమరావతి పనుల నిలిపివేతకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం

చంద్రబాబు సర్కారుకు షాక్.. అమరావతి పనుల నిలిపివేతకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం
, శనివారం, 10 అక్టోబరు 2015 (15:58 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్కారుకు గ్రీన్ ట్రిబ్యునల్ గట్టిషాకిచ్చింది. తక్షణం అమరావతి నిర్మాణ పనులు నిలిపి వేయాలంటూ శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఏపీ సర్కారు మాత్రం దసరా పర్వదినం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న విషయంతెల్సిందే. ఈ మేరకు ఇప్పటికే కార్యక్రమ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. శంకుస్థాపనను కనీవినీ ఎరుగని రీతిలో, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఓ పండుగలా నిర్వహించాలని భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏపీ సర్కారుకు షాకిచ్చింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి తుళ్లూరు పరిధిలో జరుగుతున్న భూమి చదును పనులను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి రాజధాని ప్రాంతంలో తొలుత గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వుంది. ఈ మేరకు పర్యావరణ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ఏపీ సర్కారు హామీ ఇచ్చింది. కానీ, గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వం పనులు మొదలుపెట్టిందంటూ ఒకరు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. 
 
గ్రీన్ కారిడార్‌కు విరుద్ధంగా ఏపీ సర్కారు తోటలను తొలగిస్తోందని అందులో పేర్కొన్నారు. తన వాదనను బలంగా వినిపించేందుకు అతడు తోటల తొలగింపునకు సంబంధించిన ఫొటోలను కూడా జతచేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ తక్షణమే భూమి చదును పనులు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. అమరావతి శంకుస్థాపనపై ఏపీ కేబినెట్ కీలక భేటీ జరుగుతున్న సమయంలోనే ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu