Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెదక్ ట్రైన్ యాక్సిడెంట్: రుచిత సాహసం అదుర్స్.. హ్యాట్సాఫ్!

మెదక్ ట్రైన్ యాక్సిడెంట్: రుచిత సాహసం అదుర్స్.. హ్యాట్సాఫ్!
, మంగళవారం, 29 జులై 2014 (13:44 IST)
18 మంది చిన్నారులను ఉసురు తీసుకున్న మెదక్ ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి రుచిత సాహసం ప్రదర్శించింది. రుచిత ప్రదర్శించిన సమయస్ఫూర్తి, సాహసం అందరినీ అబ్బురపరిచాయి. తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లికి చెందిన శివంపేట మల్లేశ్‌గౌడ్‌, లతలకు రుచిత(8), వరణ్‌గౌడ్‌(7), శృతి(5)లు ముగ్గురు సంతానం. వీరు ముగ్గురూ కాకతీయ టెక్నో స్కూల్‌లో చదువుతున్నారు. 
 
అయితే ఈనెల 24న రోజూలాగే వెంకటాయపల్లి నుంచి స్కూల్‌ బస్సులో పాఠశాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో మాసాయిపేట రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ దగ్గర స్కూల్ బస్సు ఉన్నప్పుడు... రైలు రావడం రుచిత గమనించింది. వెంటనే, కేకలు వేసి డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించింది. 
 
అయితే, ఫోన్‌లో మాట్లాడుతున్న డ్రైవర్‌కు రుచిత కేకలు వినిపించలేదు. దీంతో రైలు తమ బస్ వైపు వేగంగా రావడం గమనించిన రుచిత... క్షణంలో తన పక్కనే ఉన్న వెంకటాయపల్లికి చెందిన నాలుగేళ్ల మహీపాల్‌రెడ్డి, సద్భావన్‌దాస్‌లను కిటికీల్లోంచి కిందకు తోసేసింది. పక్కనే ఉన్న తమ్ముడు వరణ్‌గౌడ్‌ను కూడా తోసేందుకు ప్రయత్నించగా... అతడు కాస్త బరువుగా ఉండడంతో రుచితకు వీలుకాలేదు. ఇద్దరిని బయటకు తోసేసిన రుచిత తానూ బయటకు దూకి ప్రాణాలు దక్కించుకుంది. 
 
రుచిత సాహసంతో బయటపడిన మహీపాల్‌రెడ్డి, సద్భావన్‌దాస్‌ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఎనిమిదేళ్ల చిన్నారి ఘోరమైన ప్రమాద సమయంలో చూపిన ఆత్మవిశ్వాసం అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఈ ప్రమాదంలో రుచిత తన చెల్లెలు శృతిని కాపాడుకోలేకపోయింది. రుచిత కాపాడలేకపోయినప్పటికీ... అదృష్టవశాత్తూ తమ్ముడు వరుణ్ గౌడ్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం రుచితతో పాటు తమ్ముడు వరణ్‌గౌడ్‌ కూడ సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ చిన్నారి సాహసానికి ప్రతి ఒక్కరు 'హాట్సాఫ్ రుచిత' అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu