Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్సార్‌కు రాష్ట్ర ప్రజానీకం ఘన నివాళులు

వైఎస్సార్‌కు రాష్ట్ర ప్రజానీకం ఘన నివాళులు
హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి రాష్ట్ర ప్రజానీకం ఘన నివాళులు అర్పిస్తోంది. సాధారణ పౌరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతోపాటు వైఎస్సార్‌కు నివాళులు అర్పించేందుకు కేంద్ర నాయకులు కూడా శుక్రవారం హైదరాబాద్ వస్తున్నారు. వైఎస్సార్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు ఇప్పటికే నివాళులు అర్పించారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఈ రోజు ఉదయం ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళి అర్పించారు. కర్ణాటక మంత్రి గాలి జనార్థన్ రెడ్డి కూడా వైఎస్ భౌతిక కాయాన్ని దర్శించి అశ్రునివాళి అర్పించారు. రాష్ట్రంలోని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా వైఎస్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి సైనిక నివాళి అర్పించారు.

ఇదిలా ఉంటే వైఎస్ మరణవార్త విన్న కొందరు అభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ మరణవార్తను తట్టుకోలేక గుండెపోటు, ఆత్మహత్యలతో 50 మందికిపైగా అభిమానులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ కుమారుడు జగన్ మాట్లాడుతూ.. అభిమానులు, కార్యకర్తలు ఎలాంటి అఘాయిత్యాలకు, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పారు.

తమ ప్రియతమ నేత తిరిగిరాని లోకాలకు వెళ్లారనే బాధతో ఎవరూ గుండె ధైర్యం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. వైఎస్సార్ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్లాలని, ఇదే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని జగన్ అన్నారు. మరోవైపు వైఎస్సార్ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు లక్షలాది మంది అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు.

వైఎస్ అంతిమయాత్రకు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రజల సందర్శనార్థం ముఖ్యమంత్రి భౌతికకాయాన్ని ఈ రోజు ఉదయం ఎల్బీ స్టేడియంలో ఉంచనున్నారు. ఇక్కడ అధికారిక యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రముఖులకు, పార్టీ కార్యకర్తలకు, సామాన్య పౌరులకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వైఎస్ భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చే అభిమానులకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

Share this Story:

Follow Webdunia telugu