Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజీనామాలతో ఆత్మరక్షణలో పడిన తెరాస చీఫ్ కేసీఆర్!

రాజీనామాలతో ఆత్మరక్షణలో పడిన తెరాస చీఫ్ కేసీఆర్!
FILE
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆత్మరక్షణలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులను సైతం కలుపుకుని పోవాలని భావించిన కేసీఆర్‌కు దిమ్మ తిరిగినట్లైంది.

మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లి తెలంగాణ ప్రజాప్రతినిధులను ఒకే తాటిపై తెచ్చి పెద్దన పాత్ర పోషించాలని భావించిన కేసీఆర్‌కు చుక్కెదురైంది. కాంగ్రెస్ తెలంగాణ ప్రజాప్రతినిధులకు కె. జానారెడ్డి నాయకత్వం వహిస్తుండగా, తెలుగుదేశం ఉద్యమానికి ఎర్రబెల్లి దయాకరరావు నాయకత్వం వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెరాస చక్రబంధంలో ఇరుక్కున్న తెలంగాణ రాజకీయ జేఏసీ కింద పనిచేయడానికి తెదేపా, కాంగ్రెస్ పార్టీల తెలంగాణ నాయకుడు ఇష్టపడటం లేదు. అంతేగాకుండా టి.కాంగ్రెస్ నేతలు తెలంగాణ జేఏసీకి తమపై అధికారం చెలాయించడాన్ని ఇష్టపడట్లేదని, అలాగే తెదేపా కూడా ఎర్రబెల్లి నాయకత్వంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే తెదేపా టి. నేతలు బస్సు యాత్రలు కూడా చేపట్టారు. అయితే తెదేపా బస్సు యాత్రకు తెలంగాణలో మెల్ల మెల్లగా ప్రజల ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో తెరాస నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని సమాచారం.

ఇంత కాలం తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది కెసిఆర్, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అయినప్పటికీ మూకుమ్మడి రాజీనామాల ద్వారా తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు పైచేయి సాధించారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఒంటరి చేసి తమ తమ పార్టీలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రెండు పార్టీల నాయకులు పనిచేస్తున్నట్లు తెలిసింది.

తెరాస ఏకపక్ష విధానాలను, తెరాస చెప్పుచేతల్లో నడుస్తున్న కోదండరామ్‌ పద్ధతిని కూడా ఆ రెండు పార్టీల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిష్పక్షపాతంగా, సమిష్టి నిర్ణయాలకు అవకాశం ఇచ్చే కొత్త తెలంగాణ జేఏసీని తెదేపా, కాంగ్రెస్ పార్టీల టి.నేతలు కోరుతున్నారు. తద్వారా తెరాసను పక్కకు నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu