Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్లాక్ మార్కెట్ భరతం పట్టండి: ముఖ్యమంత్రి

బ్లాక్ మార్కెట్ భరతం పట్టండి: ముఖ్యమంత్రి
, ఆదివారం, 9 ఆగస్టు 2009 (11:02 IST)
File
FILE
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్న బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. ఎలాగైనా నిత్యావసర వస్తువుల ధరలు తక్షణం తగ్గేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ విషయంలో అధికారులు అలక్ష్యం ప్రదర్శిస్తే మాత్రం సహించబోనని హెచ్చరించారు.

నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసర ధరలపై ముఖ్యమంత్రి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ ఎస్కే.జయచంద్ర, మినిస్టీరియల్ సిబ్బంది, సివిల్ సప్లై, మార్కెటింగ్, హార్టికల్చర్ తదితర విభాగాలకు చెందిన అధికారులకు సీఎం తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘ చర్చలు జరిపారు.

బ్లాక్‌మార్కెట్‌ను శాసిస్తున్న దళారులు, బ్రోకర్ల ప్రమేయానికి అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నిత్యావసరాలు సాధారణ ధరలతో ప్రజానీకానికి సరిపడ అందుబాటులోనికి తీసుకు రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిత్యావసరాల ధరలు దిగివచ్చే వరకు వారం, వారం ఈ అంశంపై సమీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అన్ని శాఖల అధికారులు అనుసంధానం చేసుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని కోరారు. కందిపప్పు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అందుబాటులో లేకుండా పోయిందని, తెల్లకార్డు లబ్ధిదారులకు అసౌకర్యం కలిగించకుండా మయన్మార్ దేశం నుండి 52 వేల టన్నులు తెప్పించి పంపిణీ చేస్తున్నామని సీఎం వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు నేటినుండి మిల్లులు,ప్రైవేటు గోడౌన్లపై ముమ్మర తనిఖీలు నిర్వహించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu