Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొట్టి శ్రీరాములుకు ఒక న్యాయం.. నాకొకటా: కేసీఆర్

పొట్టి శ్రీరాములుకు ఒక న్యాయం.. నాకొకటా: కేసీఆర్
, సోమవారం, 9 నవంబరు 2009 (11:39 IST)
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఒక న్యాయం నాకొక న్యాయమా అంటూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రశ్నించారు. ఆయన మాత్రం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటిస్తే ఆనాడు ఒక్కరైనా అడ్డు చెప్పారా అంటూ ప్రశ్నించారు. తాను మాత్రం ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించిన మరుక్షణం నుంచే అనేక మంది నానా విధాలుగా మాట్లాడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.

దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెలాఖరులోగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఇచ్చేది లేనిది తేల్చాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తాను చివరిసారిగా ముఖ్యమంత్రి రోశయ్య, గవర్నర్ ఎన్.డి.తివారీలను ఇప్పటికే కలిసినట్టు చెప్పారు.

అలాగే, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలతో సమావేశమై ప్రత్యేక తెలంగాణా అంశంపై చర్చిస్తామని తెలిపారు. వీరి నుంచి స్పష్టమైన హామీ వచ్చినా రాకపోయినా ఈనెలాఖరు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.

తమ ఆశయ సాధనలో భాగంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం రక్తతర్పణం చేస్తామని తెలిపారు. చరిత్రను తిరిగేస్తే ఇదే విషయం మీకు తెలుస్తుందన్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. నాడు ఆంధ్రరాష్ట్రం కోసం అమరజీవి ప్రాణత్యాగం చేసిన విషయం అందరికీ తెల్సిందే. అయితే, తాను ప్రత్యేక తెలంగాణాకు ప్రాణత్యాగం చేస్తామంటే అనేక మంది అడ్డుపడుతున్నారన్నారు.

ఆరునూరైనా ప్రాణత్యాగం చేసి తీరుతానని ప్రకటించారు. తాను చేపట్టే ఆమరణదీక్షను అడ్డుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కెసీఆర్ హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu