Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణా ఇవ్వండి.. అవసరమైతే దేశాన్ని ముక్కలు చేయండి

తెలంగాణా ఇవ్వండి.. అవసరమైతే దేశాన్ని ముక్కలు చేయండి
, శనివారం, 10 సెప్టెంబరు 2011 (14:26 IST)
తెలంగాణా ప్రజల ఆకాంక్ష మేరకు సత్వరమే తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చేయాలనీ, ఒకవేళ తెలంగాణా విభజన తర్వాత చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఊపందుకుంటే రెండో ఎస్సార్సీ వేసి ముక్కలు చేయండని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు సూచిస్తున్నారు.

శనివారం కె. కేశవరావు ఇంట్లో సమావేశమైన అనంతరం తెలంగాణా టి.నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణా సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తమకు సెప్టెంబరు నెల ఆఖరు వరకూ సమయం ఇవ్వాల్సిందిగా తమ అధిష్టానం కోరిందనీ, దాని ప్రకారం తాము సెప్టెంబరు చివరి వరకూ వేచి చూస్తామని తెలంగాణా కాంగ్రెస్ నేతలు చెప్పారు.

సీమాంధ్ర నాయకులు మొన్నీమధ్య రాష్ట్రాన్ని విభజిస్తే కలిగే నష్టాలేంటి అనే అంశంపై ఓ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ గారికి ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారనీ, అయితే ఆ ప్రెజెంటేషన్ అంతా శుద్ధ అబద్ధపు నివేదిక అని మండిపడ్డారు.

హైదరాబాదులో 5 లక్షల 50 వేల మంది సీమాంధ్రులు నివాసం ఉంటున్నారని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణా ఏర్పాటులో వారికేమైనా అనుమానాలు ఉంటే నేరుగా వెళ్లి అధిష్టానంతో మాట్లాడుకోవచ్చని, అయితే హైదరాబాదుతో సహా తమకు తెలంగాణా రాష్ట్రం కావాలని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు టి. నేతలు.

ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 54 ఏళ్లలో 44 సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని ఆంధ్రవారే పాలించారనీ, కేవలం 10 ఏళ్లపాటు మాత్రమే తెలంగాణా ప్రాంతం వారు ఈ పదవిని అలంకరించారని చెప్పుకొచ్చారు. తెలంగాణాకు జరిగిన అన్యాయం ఇంతకన్నా వేరే నిదర్శనం ఎందుకని ప్రశ్నించారు.

అధిష్టానం చెప్పినట్లు తాము ఇప్పటివరకూ సంయమనం పాటించామనీ, అక్టోబరు 1 నుంచి మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేమని టి. నేతలు అంటున్నారు. సెప్టెంబరు 30 తర్వాత అంతా కలిసి మూకుమ్మడిగా ఒక నిర్ణయాన్ని తీసుకుని తెలంగాణా సాధిస్తామన్నారు. ఐతే ఆ నిర్ణయం ఏంటని ప్రశ్నిస్తే... ఇప్పుడు చెప్పలేమనీ, కానీ తాము చేస్తున్నప్పుడు మీరు చూడవచ్చని మంధా జగన్నాథం వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu