విజయవాడ నగరంలో గుండె జబ్బుతో ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె అంత్యక్రియల సమయంలో సుమారుగా 60 మంది వరకు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చనిపోయిన వృద్ధురాలికి 75 యేళ్లతో పాటు... హృద్రోగంతో బాధపడుతున్నది. దీంతో ఆమె గుండె జబ్బు కారణంగానే చనిపోయివుంటుందని భావించారు. కానీ, ఆ వృద్ధురాలికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు అంత్యక్రియలకు హాజరైనవారు భయంతో వణికిపోతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
విజయవాడ నగరంలోని గాంధీ నగర్‌కు చెందిన మహిళ ఈనెల 11వ తేదీన గుండె జబ్బుతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. 75 సంవత్సరాల వయసు ఉండటంతో గుండె జబ్బు మాత్రమే ఉంటుందని భావించిన వైద్యులు చికిత్స చేశారు. అయితే ఆ మరుసటి రోజే ఆ వృద్ధురాలు మృతి చెందింది.
ఈ నెల 13న కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వృద్ధురాలికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14న వచ్చిన రిపోర్ట్స్‌తో పాజిటివ్ అని తేలింది. ఆ అంతిమ సంస్కారాలకు 60 మంది సన్నిహితులు, పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. రిపోర్ట్‌తో ఒక్కసారిగా గాంధీనగర్‌లో కలకలం రేగింది.